దొంగ–పోలీస్‌.. ఓ గూగుల్‌ మ్యాప్‌!

13 Jan, 2018 04:08 IST|Sakshi

  నేరస్తుల గృహాలకు జియో ట్యాగింగ్‌

    18 నుంచి నేరస్తులపై సమగ్ర సర్వే...  

  రాష్ట్ర వ్యాప్తంగా నేరగాళ్ల లెక్కకు ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: పదే పదే దొంగతనాలు చేసే నేరస్తుల సర్వేతో పాటు నివాస గృహాలకు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా జియో ట్యాగ్‌ చేయాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాపర్టీ నేరగాళ్లు ఎంతమంది? వారి నివాసాలెక్కడ? అసలు మొత్తం దొంగలెంత మంది అన్న విషయాలు ఇప్పటి వరకు పోలీస్‌ శాఖ వద్ద స్పష్టంగా లేవు. దీని వల్ల నేరస్తులు, వారి కదలికలపై దృష్టి సారించడం కష్టసాధ్యంగా మారింది. ప్రధానంగా దొంగతనాలు చేసే నేరస్తులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్‌ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టబోతోంది. పదే పదే దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే నేరస్తులను గుర్తించడం, వారి రికార్డులను అందుబాటులో పెట్టుకోవడంతో పాటు వారి పూర్తి వివరాలను సమగ్ర సర్వే ద్వారా డాటా బేస్‌లోకి తేబోతున్నారు.

ఈ మేరకు ఈ నెల 18 నుంచి కార్యాచరణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. సర్వే చేసిన వివరాలన్నీ ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి జిల్లా హెడ్‌క్వార్టర్‌ వరకు అందరి డేటా బేస్‌లో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. అలాగే నేరస్తుల గృహాలకు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేసి పెట్రోలింగ్, బ్లూకోట్స్‌ వాహనాలు, సిబ్బంది వద్దనున్న ట్యాబుల్లో నిక్షిప్తం చేయనున్నారు. దీని వల్ల దొంగతనాలు జరిగిన సందర్భాల్లో కదలికలు కనిపెట్టడం సులభంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే 2015లో హైదరాబాద్‌లో ఆరువేల మంది, సైబరాబాద్‌లో మూడువేల మంది, రాచకొండలో రెండువేల మంది నేరస్తుల గృహాలను జియో ట్యాగ్‌ చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో దొంగతనాల కేసుల్లో ఉన్న వారి వివరాలు, వారి గృహాలను గుర్తించి జియో ట్యాగ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు