నేను నిజంగానే వికలాంగుడిని

27 Jul, 2017 04:09 IST|Sakshi
నేను నిజంగానే వికలాంగుడిని
హైకోర్టుకు విన్నవించిన రోణంకి గోపాలకృష్ణ 
 
సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌–2016 పరీక్షల్లో తప్పుడు ఆంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటా ద్వారానే ర్యాంకు సాధించినట్లు తనపై పిటిషనర్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని రోణంకి గోపాలకృష్ణ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. తాను నిజంగానే వికలాంగుడినని, 2002లో జరిగిన ఓ ప్రమాదంలో తన కుడి చేయికి తీవ్ర గాయం కావడంతో ‘లోకోమోటర్‌ ఫిజికల్‌ డిజెబిలిటీ’తో బాధపడుతున్నానని వివరించారు.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం ద్వారా గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని గోపాలకృష్ణను ఆదేశించింది. ఈ మేరకు గోపాల కృష్ణ  కౌంటర్‌ దాఖలు చేశారు.
 
వికలాంగుల కోటాలోనే మొదటి ఉద్యోగం సాధించా
శ్రీకాకుళం జిల్లా మెడికల్‌ బోర్డు తనను ‘శాశ్వత లోకోమోటర్‌ డిజెబుల్డ్‌ పర్సన్‌’గా ధ్రువీ కరిస్తూ 2002లో సర్టిఫికేట్‌ జారీ చేసిందని గోపాలకృష్ణ తెలిపారు. ‘విశాఖపట్నం కింగ్‌జార్జ్‌ ఆసుపత్రి,  ఉస్మానియా ఆసుపత్రి, శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుప్రతులు నా వైకల్యాన్ని ధ్రువీకరించాయి. 2006 డీఎస్‌సీలో అంగవైకల్య కోటా కింద ఎంపికైటీచర్‌గా నియమితులయ్యా. అదే కోటా కింద గ్రూప్‌–1కు ఎంపికయ్యా. 2016లో యూపీఎస్సీ పరీ క్షలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించా.  అన్నీ నిర్ధారించుకున్న తరువాతే యూపీఎస్సీ మూడో ర్యాంకు కేటాయించింది.   దీన్ని  సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యా నికి విచారణార్హతే లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని గోపాలకృష్ణ  కోర్టును కోరారు.
మరిన్ని వార్తలు