గూబ గుయ్

3 Mar, 2015 00:18 IST|Sakshi
గూబ గుయ్

భాగ్యనగరిలో పెరుగుతున్న శబ్ద కాలుష్యం
దేశంలో గ్రేటర్‌ది రెండో స్థానం
వినికిడి సమస్యలకు  దారి తీస్తున్న వైనం

 
బంజారాహిల్స్:  శబ్ద కాలుష్యం... ప్రస్తుతం గ్రేటర్ సిటిజన్లను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. నిత్యం ఎడతెరిపి లేకుండా హోరెత్తించే రణగొణ ధ్వనులు నగరజీవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటు వాహనాల శబ్దం... ఆపైన హారన్ల హోరు... జనం చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) విడుదల చేసిన జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక శబ్ద కాలుష్యం నమోదయ్యే ఎనిమిది మహా నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల నగరంలో శబ్ద కాలుష్యంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి వీరన్న ఈ వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో చెన్నై మొదటి స్థానంలో నిలవగా... తరువాత స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. చెన్నైకి... భాగ్యనగరికి మధ్య తేడా కూడా స్వల్పంగానే ఉండడం గమనార్హం. 2011లో ఫిబ్రవరి-జూన్ నెలల మధ్య హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, కోల్‌కత్తా తదితర నగరాల్లో శబ్ద కాలుష్యంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. సాధారణంగా మనిషి వినే శబ్దం అవధి 52-72 డెసిబుల్స్ మధ్య ఉండాలి. ఈ పరిమితికి మించితే దాన్ని శబ్ద కాలుష్యంగా పేర్కొంటారు. దీంతో అనేక నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సీపీసీబీ నివేదిక ప్రకారం చెన్నైలో అత్యధికంగా సగటున 107 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం నమోదు కాగా... హైదరాబాద్‌లో  103 డెసిబుల్స్ ఉంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే అబిడ్స్, ప్యారడైజ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, పంజగుట్ట, చార్మినార్, జూపార్క్, కేంద్రీయ  విశ్వవిద్యాలయం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

నష్టాలివే...

వినికిడి అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. ఇది స్థాయి మించితే చెవిలో రింగు రింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి.

దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్న వారికి శాశ్వత వినికిడి లోపం సంభవిస్తుంది. నిద్రలేమి, అలసట, రక్తనాళ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి.

రక్తపోటు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తి కోల్పోతారు.

నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి లాంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరి బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది.

90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు తాత్కాలిక, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.

చిన్నపిల్లల కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.

అత్యధిక ధ్వనులు చిన్నపిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది.  

 నియంత్రణ ఇలా...

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం నిత్యం ఎనిమిది గంటల పాటు 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి.

{sాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్‌లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి.
 

మరిన్ని వార్తలు