జేఈఈ పరీక్ష ప్రశాంతం

4 Apr, 2016 04:26 IST|Sakshi
జేఈఈ పరీక్ష ప్రశాంతం

♦ 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష.. 27న ఫలితాలు
♦ అడ్వాన్స్‌డ్ కు అనుమతించే విద్యార్థుల సంఖ్యపై గందరగోళం
♦ టాప్ 2 లక్షల మంది విద్యార్థులని ప్రకటించిన గౌహతి ఐఐటీ
♦1.5 లక్షలే అని పేర్కొన్న సీబీఎస్‌ఈ
♦ ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 30న  ర్యాంకుల ప్రకటన
 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.07 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి 59,731 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆఫ్‌లైన్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన వారిలో 98 శాతం మంది విద్యార్థులు ఆదివారంనాటి ఎగ్జామ్‌కు హాజరైనట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) వర్గాలు వెల్లడించాయి. ఇక ఆన్‌లైన్ పరీక్ష ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తారు. గతంతో పోల్చుకుంటే ఈసారి పరీక్షలో ప్రశ్నల సరళి కాస్త సులభంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఎప్పట్లాగే ఫిజిక్స్‌లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఇచ్చినట్లు వెల్లడించారు.

 అడ్వాన్స్‌డ్‌కు ఎందరు?
 ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతించే విద్యార్థుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. మే 22న జేఈఈ అడ్వాన్స్‌డ్  పరీక్షను నిర్వహించనున్న గౌహతి ఐఐటీ.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తామని తెలిపింది. జేఈఈ మెయిన్ నిర్వహించిన సీబీఎస్‌ఈ మాత్రం తన బులెటిన్‌లో టాప్ 1.50 లక్షల మందినే అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. అడ్వాన్స్‌డ్ నిర్వహించే ఐఐటీ గౌహతి... ఇన్‌ఫర్మేషన్ బులెటిన్‌లో 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించినందున ఆ సంఖ్యే ఫైనల్ అవుతుందని నిఫుణులు వెల్లడించారు.

 27న జేఈఈ మెయిన్ ఫలితాలు...
 ఈ నెల 27న జేఈఈ మెయిన్ స్కోర్‌ను సీబీఎస్‌ఈ ప్రకటించనుంది. విద్యార్థులు ఈ నెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గౌహతి చర్యలు చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌లో భాగంగా మే 22న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2  నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడించి, జూన్ 20 నుంచి సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. మరోవైపు ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ 30న లేదా అంతకంటే ముందే జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను సీబీఎస్‌ఈ ప్రకటించనుంది. ఈ ర్యాంకుల ఖరారులో జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తారు. వాటి ఆధారంగా ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు చేపడతారు.
 
 జేఈఈలో ఫిజిక్స్ కఠినం
 జేఈఈ మెయిన్ పరీక్షలో ఈసారి ఫిజిక్స్ పేపర్ కొంత కఠినంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష మాత్రం సులభంగానే ఉందని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే గణితం తేలి గ్గానే ఉంది. చాప్టర్లు-వెయిటేజీకి సంబంధించి దాదాపు విద్యార్థుల అంచనాల ప్రకారమే ప్రశ్నలు వచ్చాయి. 16 ప్రశ్నలు డెరైక్ట్‌గా రాగా, 10 ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. 4 ప్రశ్నలు మాత్రం క్యాలిక్యులేషన్ నిడివి పరంగా పెద్దగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కటాఫ్ పెరిగే అవకాశముందని నిపుణలు అంచనా.

 పాఠ్యపుస్తకాల పరిధిలోనే ప్రశ్నలు..
 గతేడాదితో పోలిస్తే కెమిస్ట్రీ ప్రశ్నలు  కఠినంగా వచ్చాయని చెప్పొచ్చు.  ముఖ్యంగా ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ రకం ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా, ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాల పరిధిలోనే ప్రశ్నలు వచ్చాయి. 80-85 మార్కులు తెచ్చుకుంటే గట్టెక్కొచ్చని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్ల నుంచి క్రమేణా ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజీ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ విభాగం ర్యాంకింగ్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 8, ఆర్గానిక్ నుంచి 10, ఇన్‌ఆర్గానిక్ నుంచి 12 ప్రశ్నలు వచ్చాయి. కాగా, గణితం, రసాయనశాస్త్రంతో పోలిస్తే ఫిజిక్స్ కాస్త కఠినంగానే ఉంది. కానీ గతేడాది ఫిజిక్స్ ప్రశ్నలతో పోలిస్తే ఈసారి కాస్త తేలిగ్గానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. పది ప్రశ్నలు ఎంసెట్ స్థాయిలోనే వచ్చాయి. సగటు విద్యార్థి 70 మార్కుల వరకు స్కోర్ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థి 100కు పైగా స్కోర్ చేయగలిగేలా ప్రశ్నపత్రం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో రెండు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నందున చాలా మంది విద్యార్థుల రాయలేదు. ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నవి మరో రెండు ప్రశ్నలు ఇచ్చారు.
 
 ఏపీలోనూ ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్
 
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించినజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్-2016 పరీక్ష ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి అభ్యర్థుల మార్కుల స్కోరింగ్ బాగా పెరుగుతుందని, ఫలితంగా గతేడాది జేఈఈ అడ్వాన్సుకు 105గా ఉన్న కటాఫ్ మార్కులు కూడా పెరగనున్నాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు