విచారణ పేరుతో వేధించాడు | Sakshi
Sakshi News home page

విచారణ పేరుతో వేధించాడు

Published Mon, Apr 4 2016 4:14 AM

Harassing the name of the investigation :-CID, CI

మూడు నెలలుగా ఎవరికీ చెప్పుకోలేదు
శ్రుతిమించడంతోనే ఫిర్యాదు చేశా
సీఐడీ సీఐ బాధిత మహిళ
విచారణ ముమ్మరం చేసిన పోలీసులు

 
కరీంనగర్ క్రైం : విచారణ పేరుతో సీఐడీ సీఐ తనను అసభ్యకరంగా వేధించాడని, మూడు నెలలు ఎవరికీ చెప్పుకోలేక మధనపడ్డాడని, ఇటీవల వేధింపుల శ్రుతిమించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో అక్రమ ఫైనాన్‌‌స కేసులో అరెస్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా అతడి బంధువులను సీఐడీ అధికారులు కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ చేశారు.

బాధిత మహిళ కూడా మోహన్‌రెడ్డి బంధువు కావడంతో ఆమెను కూడా విచారణకు పిలిపించారు. విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫొన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి తరచూ ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఎదైనా అంటే విచారణలో భాగమే అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత రోజుకు వందలాది కాల్స్ చేయడం, వాట్సప్ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా నిరంతరంగా వచ్చి పడుతున్న మెసేజ్‌లతో మహిళ చాలా ఇబ్బంది పడింది. ఫోన్ చేయొద్దని, మెసేజ్‌లు పెట్టొద్దని కోరినా సీఐ మారలేదు. అసభ్యకరమైన బొమ్మలతో కూడిన  మెసేజ్‌లు బయటకు  చెప్పుకోలేని మెసేజ్‌లు పెట్టేవాడు. వారం రోజుల నుంచి సీఐ చేష్టలు శ్రుతిమించడంతో భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.


 విచారణ వేగవంతం
మహిళను వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో హైదరాబాద్ కార్యాలయంలో పని చేస్తున్న సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై కరీంనగర్ టుటౌన్ పీఎస్‌లో నిర్భయ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కూడా వేగవంతం చేశారు. సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.దయాకర్‌రెడ్డికి చెందిన వాట్సప్ నంబర్లు, మరో ఫొన్ నంబర్‌కు చెందిన పలు వివరాలు, కాల్‌లిస్టు సేకరించారు. బాధిత మహిళకు సెల్ ద్వారా, వాట్సప్ నంబర్ ద్వారా పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన డేటా సేకరించారు. ఈ కేసును విచారణ చేసేందుకు  టూటౌన్ సీఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు తెలిసింది. సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తూ విచారణకు వచ్చిన మహిళను వేధించడంపై  మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement