మహర్దశ | Sakshi
Sakshi News home page

మహర్దశ

Published Mon, Apr 4 2016 4:19 AM

మహర్దశ

పట్టణాభివృద్ధి సంస్థలుగా రెండు కార్పొరేషన్లు!
మాస్టర్‌ప్లాన్ అమలు
కనీస సదుపాయాల మెరుగు
ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం

 
అభివృద్ధిలో జిల్లాకు మహర్దశ పట్టనుంది.కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లుపట్టణాభివృద్ధి సంస్థలుగా ఏర్పాటు కానుండడంతో జిల్లా స్వరూపమే మారనుంది. మాస్టర్‌ప్లాన్, లేఔట్‌తోపాటు సౌకర్యాల కల్పన మెరుగుపడనుంది. పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా కార్పొరేషన్లకు ఆదేశాలు అందాయి.
 
 కరీంనగర్ కార్పొరేషన్ :  రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 70 కిలోమీటర్ల వ్యవధిలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ రెండు నగరాలు పట్టణాభివృద్ధి సంస్థలుగా అభివృద్ధి చెందే అరుదైన అవకాశం దక్కనుంది. పట్టణ ప్రాంతాలు ఇరుకుగా మారకుండా విస్తరించాలనే ఉద్ధేశంతో కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా), రామగుండం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(రుడా) పేరుతో అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. పట్టణాలకు అతి చేరువలో ఉన్న గ్రామాలను కలుపుతూ ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి సంస్థలను తీర్చిదిద్దాలని హైదరాబాద్‌లో శనివారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇందుకు కావాల్సిన అన్ని వనరులపై దృష్టిపెట్టాలని, ఆ దిశగానే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికలు పంపించాలని ఆదేశించింది.

మెరుగుపడనున్న వసతులు
కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల పరిధిలోని చుట్టూ 10 నుంచి 15 కిలోమీటర్ల వైశాల్యంలో ఉండే గ్రామాలను కలుపుతూ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కచ్చితమైన నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఇప్పటికే వేములవాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వుడా)ను ప్రతిపాదించారు. దీంతోపాటు రెండు కార్పొరేషన్ల పరిధిలో మెరుగైన ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. అర్బన్ డెవలప్‌మెంట్ కింద వచ్చే ప్రాంతాల్లో మాస్టర్‌ప్లాన్ అమలు, మౌలిక వసతుల మెరుగుదలకు పెద్దపీట వేస్తారు.  అర్బన్ ప్రాంతాల ఏర్పాటు ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 నిబంధనల ప్రకారమే...
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల మాదిరిగానే కచ్చితమైన నిబంధనలు అమలవుతాయి.

అర్బన్ డెవలప్‌మెంట్ కింద రెసిడెన్షియల్ జోన్లు, కమర్షియల్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు ఏర్పాటు చేస్తారు.పట్టణాలకు అతి సమీపంలో ఉన్న పల్లెల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడడం, మాస్టర్‌ప్లాన్ లేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్బన్ డెవలప్‌మెంట్‌లో పట్టణాలు, పల్లెలకు తేడా లేకుండా డెరైక్టర్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోకి తీసుకువస్తారు.

లేఅవుట్లకు, నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అథారిటీ అమలైతే ఒక పద్ధతి ప్రకారం పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

 ప్రతిపాదనల తయారీకి కసరత్తు
అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోకి వచ్చే గ్రామాలు, వాటి వైశాల్యం, జనాభా ప్రాతిపదికన ప్రత్యేక సర్వే నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం స్థానిక సంస్థల్లోని టౌన్ ప్లానింగ్, జిల్లా టౌన్‌ప్లానింగ్ విభాగాల సహకారం తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల మేయర్లతో సమావేశం నిర్వహించి చక్కటి ప్రతిపాదనలు పంపించాలని సమావేశంలో సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారం రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement