కట్టల్..కట్టల్

21 Mar, 2014 04:23 IST|Sakshi
కట్టల్..కట్టల్

ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కోట్లాదిరూపాయల నోట్ల కట్టలు వెలుగుచూస్తున్నాయి. గత వారంరోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు కట్టలకు కట్టల నగదు పట్టుబడగా..ఆధారాలు చూపిస్తున్న వారికి తిరిగి అప్పగిస్తున్నారు. లేనివాటిని ఐటీ అధికారులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం విజయనగర్‌కాలనీ వద్ద హుమాయున్‌నగర్ పోలీసుల తనిఖీల్లో రూ.8.59లక్షలు పట్టుకున్నారు. ఆధారాలు చూపిస్తే అప్పగిస్తామన్నారు. అలాగే లాల్‌దర్వాజా మోడ్ (నాగులచింత) వద్ద శాలిబండ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి రశీదు లేకుండా బైక్ వెళ్తున్న మహ్మద్ అబ్దుల్ హఫీజ్ నుంచి రూ.3.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పాత కర్నూలు రోడ్డులో..
 

కాటేదాన్: పాతకర్నూలు రోడ్డులో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు జరిపిన తనిఖీల్లో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు రూ.26 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. వ్యాపారానికి సంబంధించిన నగదు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తున్నామని పట్టుబడిన వారు చెప్పగా..ఆధారాలు చూపిస్తే తిరిగి డబ్బును అప్పగిస్తామని సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.
 

హెచ్‌ఎంటీ బస్టాపు వద్ద రూ.14 లక్షలు
 

మల్లాపూర్: హెచ్‌ఎంటీ బస్టాప్ వద్ద నాచారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌లు రూ.14 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు.
 

వైస్రాయ్ చౌరస్తాలో..

 బన్సీలాల్‌పేట : వైస్రాయ్ చౌరస్తాలో గాంధీనగర్ పోలీసుల తనిఖీల్లో రూ.5.70 లక్షలను కారులో వెళ్తున్న ఓ వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే డబ్బుకు సంబంధించి తనవద్ద అన్ని ఆధారాలున్నాయని, ఇలా పట్టుకోవడం దారుణమని ఆయన  వాపోయారు.

 ఎల్‌బీనగర్,వనస్థలిపురంలలో..

 నాగోలు/ఆటోనగర్: వనస్థలిపురం,ఎల్‌బీనగర్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యాపారుల నుంచి రూ. 3.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో వచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తున్నామని, తమ వద్ద ఆధారాలున్నాయని వ్యాపారులు వెల్లడించారు.

 హసన్‌నగర్ వద్ద..
 

బహదూర్‌పురా: హసన్‌నగర్ వద్ద బహదూర్‌పురా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.2.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఎన్నికల అధికారికి అప్పగించారు.

 రూ.42లక్షలు స్వాధీనం,అప్పగింత
 

లంగర్‌హౌస్: టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద లంగర్‌హౌస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేటు సిబ్బంది ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ.42 లక్షలు పట్టుకున్నారు. ఆధారాలు చూపించడంతో తిరిగి అప్పగించారు.
 

వారాసిగూడ వద్ద రూ.2 లక్షలు

 చిలకలగూడ: వారాసిగూడ వద్ద చిలకలగూడ పోలీసుల తనిఖీల్లో ఓ ప్రైవేటు ఉద్యోగి బైక్‌పై తీసుకెళ్తున్న రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
 
 

మరిన్ని వార్తలు