సాక్షి కార్టూనిస్టు శంకర్ను అభినందించిన కేసీఆర్

28 Jul, 2015 20:27 IST|Sakshi
సాక్షి కార్టూనిస్టు శంకర్ను అభినందించిన కేసీఆర్

హైదరాబాద్: సాక్షి ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ నెల 11న పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ-2014 అవార్డును శంకర్ అందుకున్నారు. ఆయన వరల్డ్ ప్రెస్ కార్టూన్ డైరెక్టర్ ఆంథోనీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ను మంగళవారం కలుసుకున్నారు. శంకర్ లాంటి సామాజిక స్పృహ ఉన్న కార్టూనిస్ట్ తెలంగాణకు గర్వకారణం అని కొనియాడారు.

పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు గ్రాండ్ ప్రీ అవార్డును ప్రకటిస్తుంది. ఓ రకంగా దీనిని పత్రికా రంగంలో నోబెల్ అవార్డుగా భావిస్తారు. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కూడా.

కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు. నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ సాక్షి దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో 20సార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్‌లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు