ఉద్యమ నాయిక!

18 Mar, 2017 03:18 IST|Sakshi
ఉద్యమ నాయిక!

స్ఫూర్తి   రాజ్‌కుమారి అమృత్‌ కౌర్‌

రాజ్‌కుమారి అమృత్‌ కౌర్‌... భారత జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళల్లో ఒకరు. ఆమె 1822లో లక్నోలో పుట్టారు. వారిది కపుర్తల రాజకుటుంబం. ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు, సాంఘిక సంస్కర్త. గాంధీ బాటలో హరిజన ఉద్ధరణకు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. జలియన్‌వాలాబాగ్‌ దురంతం రాజ్‌కుమారిని కలచివేసింది. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై స్వాతంత్య్రోద్యమంలో చొరవగా పాల్గొన్నారామె. దండి సత్యాగ్రహం సందర్భంగా 1930లో ఆమెను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. ఆ తర్వాత ఏడేళ్లకు ఆయుధాలు రవాణా చేస్తున్నారనే నెపం మోపి ఆమెను మరోసారి అరెస్ట్‌ చేశారు. అప్పుడామె మూడేళ్ల కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఉద్యమంలో భాగంగా రాజ్‌కుమారి దేశమంతటా పర్యటించారు. అంటరానితన నిర్మూలన అవసరాన్ని వివరించారు. ఆమె వెళ్లిన ప్రతిచోటా మహిళలతో ఓ చిన్న సమూహాన్ని ఏర్పరిచి చదువకు బీజాలు వేశారు. రాజకుటుంబంలో పుట్టిన యువరాణి సామాన్యుల కోసం ఉద్యమించడం, సామాన్యులతో కలిసి పని చేయడం వల్ల ఆమె స్ఫూర్తితో అనేకమంది ఉద్యమబాటపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్‌కుమారి కౌర్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఉన్న అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఆమె చొరవతోనే ఏర్పాటైంది.

మరిన్ని వార్తలు