మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన తెలంగాణ సర్కార్

16 Nov, 2016 19:42 IST|Sakshi

హైదరాబాద్: పౌర సేవలను మరింత విస్తృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ ఇండియా చేతులు కలిపాయి. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ బుధవారం ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... టీఎస్-క్లాస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్లాస్‌ల నిర్వహణకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని క్లౌడ్, మెషీన్ లెర్నింగ్, మొబైల్ టెక్నాలజీల సాయంతో విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.

డెంగీ లాంటి వ్యాధులు ఎప్పుడు, ఎలా ప్రబలే అవకాశముందో కూడా అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం ద్వారా ముందుగానే అంచనా వేసేందుకు అవకాశాలున్నాయని, దీన్ని కూడా తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. అలాగే టెలివిజన్ల ద్వారా పల్లెల్లో, సుదూర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసిందని, తెలంగాణలో దీనిపై పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భన్సాలీ తెలిపారు.

మరిన్ని వార్తలు