కొత్త రీజియన్లతో కొత్త చిక్కులు!

2 Apr, 2017 03:02 IST|Sakshi
కొత్త రీజియన్లతో కొత్త చిక్కులు!

- ఆర్టీసీ మరో అయోమయ వ్యవహారం
- హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు రీజియన్లు రద్దు


సాక్షి, హైదరాబాద్‌: అవసరం లేకున్నా అదనపు రీజియన్లు సృష్టించి చేతులు కాల్చుకున్న ఆర్టీసీ వాటిని ఉపసంహరించుకుంది. హైదరాబాద్‌లో ఆరు నెలల క్రితం రెండు కొత్త రీజియన్లను ఆర్టీసీ సృష్టించింది. అప్పటివరకు సికింద్రాబాద్, హైదరాబాద్‌ రీజియన్లు ఉండగా, వాటికి అదనంగా చార్మినార్, సనత్‌నగర్‌ రీజియన్లను ప్రారంభిం చింది. రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కొత్త రీజియన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా, అయోమయం నెలకొంది. హైదరాబాద్‌లో తక్కువ విస్తీర్ణంలో వేల సంఖ్యలో బస్సులు నిర్వహించాల్సి రావటంతో సరిహద్దు సమస్యలు ఎదురయ్యాయి. ఏ బస్సు, ఏ రూటు ఎవరిదో ఒక్కోసారి గందరగోళం నెలకొనేది. దీంతో చార్మినార్, సనత్‌నగర్‌ రీజియన్లను రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు గతంలో ఒక్కో రీజియన్‌ పరిధిలో రెండు చొప్పున మాత్రమే డివిజన్లు ఉండగా.. వాటి సంఖ్యను ఆరుకు పెంచింది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావటంతో ఒక్కో జిల్లాకు ఒక్కో డివిజన్‌ చొప్పున ఏర్పాటు చేసి డివిజనల్‌ మేనేజర్లను ఇన్‌చార్జులుగా నియమించింది. కానీ హైదరాబాద్‌లో మాత్రం డిప్యూటీ సీఎంఈ, డిప్యూ టీ సీటీఎంల పేరుతో ఆపరేషన్‌ ఒకరు, మెయిం టెనెన్స్‌ ఒకరు చూసేలా బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో జిల్లాల్లో ఒకలా, నగరంలో మరోలా ఉంటూ అయోమయానికి కారణమైంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంఈ, డిప్యూటీ సీటీఎంల స్థానంలో డివిజనల్‌ మేనేజర్లనే నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రెండు రీజియన్లకు కలిపి కొత్తగా చీఫ్‌ మేనేజర్‌ పోస్టును సృష్టించి సిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కార్యాలయంలో నియమించారు.

మరిన్ని వార్తలు