మైండ్ ‘సెట్’ మార్చుకోండంటూ క్లాస్..

25 Aug, 2015 13:37 IST|Sakshi
మైండ్ ‘సెట్’ మార్చుకోండంటూ క్లాస్..

హైదరాబాద్ : ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా మైండ్ ‘సెట్’ మార్చుకోవాలని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ మహిళ ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో విచారణ సమయంలో కుప్పకూలి ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. సుమారు రెండున్నర గంటల పాటు నగర పోలీసు సిబ్బందికి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా హితబోధ చేశారు.

 

‘‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇదే సమయంలో కొందరి తొందరపాటు నిర్ణయాలు, అనాలోచిత చర్యలతో తలెత్తుకోకుండా చేస్తున్నారు. మహిళలను విచారించేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మహిళా కానిస్టేబుళ్ల సమక్షంలోనే వారిని విచారించాలి. సాయంత్రం ఆరు గంటల తర్వాత మహిళలను పోలీసు స్టేషన్లలో ఉంచకూడదు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా.., ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్ వంటి ఘటనలు పునరావృతమైన గట్టి చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.   

 మర్యాదగా  వ్యవహరించండి...

 ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. ఏ కేసు పెట్టాలనుకుంటున్నారో తెలుసుకోండి. పోలీసు స్టేషన్ గడపతొక్కిన ప్రతివ్యక్తీకి తనకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇచ్చేలా వ్యవహరించాలి. పోలీసులంటే శత్రువులు కాదని, తమకు న్యాయం చేసే మిత్రులనే నమ్మకం వారిలో వచ్చేలా చేయాలి. ‘ఈనెల తొలివారంలో మారేడ్‌పల్లి ఠాణాలో జరిగిన ఘటన, తాజాగా ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో జరిగిన ఘటన పోలీసులకు మాయని మచ్చలా తయారయ్యాయి.  వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు కమిషనరేట్ నుంచి ఉన్న నిబంధనలకు అనుగుణంగా ప్రతి పోలీసు పనిచేయాలి. ప్రజలతో ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా అడుగులు వేయండి.   

 ట్రావెల్స్ వారీగా వివరాలు సేకరించండి...

 నాసిక్, త్రయంబకేశ్వర్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే నగరవాసుల వివరాలను ట్రావెల్స్ నిర్వాహకుల నుంచి సేకరించండి. ప్రతి వ్యక్తి సమాచారం ఉండేలా జాగ్రత్తపడండి. కుంభమేళా సమయంలో భక్తులు వ్యవహరించాల్సిన తీరుతో పాటు తొక్కిసలాట జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాత్రికులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయండి అని కమిషనర్ చెప్పారు.
 
 రోజంతా నిఘా...

 నగరంలో గొలుసు చోరీలు, ఇళ్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఆయా ఘటనల్లో అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు గాయపడుతున్నారు. ఈ ఘటనలను తగ్గించేందుకు పెట్రోలింగ్ వాహనాల సిబ్బందితో 24 గంటలూ మరింత నిఘా పెట్టాలి. నగరవాసులకు భద్రతపై భరోసా కల్పించాలి. ఈ దిశగా హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు పని చేయాలి.

మరిన్ని వార్తలు