అబార్షన్ కోసం వచ్చిన గర్భిణి మృతి

14 Nov, 2014 00:47 IST|Sakshi

శాలిబండ: అబార్షన్ కోసం వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు గురువారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు యత్నించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొండాపూర్‌కు చెందిన చెన్నయ్య భార్య యాదమ్మ(36) ఇటీవల గర్భం దాల్చింది. ఇప్పటికే ఆమెకు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ వయసులో పిల్లల్ని కనడం కష్టమని భావించింది.

అబార్షన్ చేయించుకునేందుకు గత నెల 22నపేట్లబురుజు ఆస్ప్రత్రికి వచ్చింది. ఎంటీపీ సమస్య ఉన్న కారణంగా ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని ఆమెకు అబార్షన్  చేయాల్సిందేనని వైద్యులు కూడా సూచించారు. తర్వాత చేయించుకుంటానని వెళ్లిన ఆమె బుధవారం ఆస్పత్రికి వచ్చింది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఆపరేషన్ గదికి తీసుకువెళ్తుండగా యాదమ్మ మృతి చెందింది.  కాగా ఆమె మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వస్తే తెలుస్తాయని ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీదేవి తెలిపారు.

సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో యాదమ్మ కుటుంబ సభ్యులు గురువారం అసెంబ్లీ ఎదుట ధర్నా చేసేందుకు యత్నించారు.  వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు