దారి’ దోపిడీ షురూ!

22 Sep, 2017 02:31 IST|Sakshi
దారి’ దోపిడీ షురూ!

దసరా రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్‌
బస్సు చార్జీల ధరలు అడ్డగోలుగా పెంపు
రెట్టింపు చార్జీలతో ప్రయాణికుల జేబులు లూటీ
ఏటా ఇదే తంతు.. పట్టించుకోని రవాణాశాఖ


సాక్షి, హైదరాబాద్‌:  దసరా సెలవుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ ‘దారి’ దోపిడీ మళ్లీ మొదలైంది. రద్దీని అవకాశంగా తీసుకుని బస్సు చార్జీల మోత మోగిపోతోంది. హైదరాబాద్‌ నుంచి ఇతర ప్రాంతాలు, జిల్లాలకు వెళ్లే బస్సుల్లో చార్జీలను అడ్డగోలుగా పెంచేశారు. ఏకంగా రెట్టింపునకుపైగా వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా పండుగ రద్దీ పేరుతో 50 శాతం దాకా అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. అటు రైల్వే కూడా ప్రత్యేక రైళ్ల పేరిట చార్జీల మోత మోగిస్తోంది. మొత్తంగా ప్రయాణికులు మాత్రం లబోదిబోమంటున్నారు.

నిలువు దోపిడీ ఇది..
రాష్ట్రంలో రెండు రోజుల కింద దసరా సెలవులు మొదలయ్యాయి. దీంతో హైదరా బాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ రద్దీని అవకాశంగా తీసుకుని ప్రయాణికులపై ముప్పే ట దాడి మొదలైంది. ఇప్పటికే ఆర్టీసీ, రైల్వే అదనపు చార్జీల వసూలు మొదలుపెట్టగా.. ప్రైవేటు ట్రావెల్స్‌ అయితే నిలువుదోపిడీకి తెరతీశాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్లు లభించనివారు... హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.

వారి వద్ద నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు సాధారణం కంటే ఏకంగా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉండే విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం వంటి మార్గాల్లో బాదుడు మరింత దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ఏసీ బస్సుల్లో చార్జీ రూ.450 నుంచి రూ.500 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.950 నుంచి రూ.1,100 వరకు పెంచారు. అంటే నలుగురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తే ఏకంగా నాలుగైదు వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో సగటు వేతన జీవులు విలవిల్లాడిపోతున్నారు. పండుగ అంటే కొత్త బట్టలు, సామగ్రి వంటి ఖర్చు ఎలాగూ ఉంటుంది. దానికితోడు చార్జీల భారంతో అంచనాలు తలకిందులవుతున్నాయి.

రద్దీని బట్టి మోత!
హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు రోజూ 650 నుంచి 700 ప్రైవేట్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి నిర్వాహకులు పండుగలు, సెలవుల వంటి సందర్భాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతారు. అదనపు వసూళ్లు మొదలుపెడతారు. వాస్తవానికి ప్రైవేటు బస్సులన్నీ కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని.. స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్నవే. అవి కేవలం కాంట్రాక్టు ప్రాతిపదికన పర్యాటక, దర్శనీయ ప్రాంతాలకు, ఇతర అవసరాలకు మాత్రమే రాకపోకలు సాగించాలి. కానీ ప్రయాణికులను ఎక్కించుకుంటూ స్టేజీ క్యారేజీలుగా తిప్పుతున్నారు. దీనిని ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. కనీసం వాటిలో అడ్డగోలుగా చార్జీల వసూలును నియంత్రించడంపైనా దృష్టి సారించడం లేదు. ప్రైవేట్‌ బస్సుల చార్జీల అంశం తమ పరిధిలో లేదంటూ రవాణాశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి వివిధ నగరాలకు వెళ్లే  ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు (రూ.లలో)

                           నాన్‌ ఏసీ బస్సులు                ఏసీ బస్సులు
ప్రాంతం             సాధారణం     ప్రస్తుతం        సాధారణం      ప్రస్తుతం
విజయవాడ           350          600              450           850
వైజాగ్‌                  550          950              750          1,400
తిరుపతి               500         1,000            650          1,300
గుంటూరు             400           750             450           950
రాజమండ్రి            550         1,100            750          1,550
కాకినాడ              550          1,100            750          1,550.


పండుగ సంబరం ఆవిరి
‘‘మాది శ్రీకాకుళం. దసరా సెలవులు వచ్చాయంటే కుటుంబమంతా స్వగ్రామానికి వెళ్లి ఆనందంగా గడిపి వస్తాం. రైల్వే రిజర్వేషన్‌ దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్లు దొరకడం లేదు. రెట్టింపు చార్జీలు చెల్లించి ప్రైవేటు బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది. పండుగ సంబరం చార్జీలకే ఆవిరైపోతోంది..’’
– జి.నర్సింగరావు, కూకట్‌పల్లి, హైదరాబాద్‌


వేలకు వేలు చార్జీలకే..
‘‘మాది ఖమ్మం. ఏటా దసరా సెలవులకు ఊరికి వెళతాం. ఈసారి ముందుగా రైల్వే రిజర్వేషన్‌ చేయించుకోలేకపోయా. ఇప్పుడు ట్రావెల్స్‌ బస్సులో వెళ్లాల్సి వస్తోంది. సామాన్య, మధ్యతరగతివారు వేలకు వేలు చార్జీలకే ఖర్చుచేసి ఊరికి వెళ్లి రావాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి..’’
– గోపీ భాస్కర్‌రావు, మోతీనగర్‌

మరిన్ని వార్తలు