చిన్న ఆధారం కూడా కీలకమే | Sakshi
Sakshi News home page

చిన్న ఆధారం కూడా కీలకమే

Published Fri, Sep 22 2017 2:34 AM

చిన్న ఆధారం కూడా కీలకమే - Sakshi

 ► హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కేసీ భాను
 ► ‘నేర విచారణ–ఎఫ్‌ఐఆర్‌ నుంచి తీర్పు వరకు’ అంశంపై ఉపన్యాసం


సాక్షి, హైదరాబాద్‌: క్రిమినల్‌ కేసులకు సంబంధించి దర్యాప్తులో, కోర్టు విచారణలో అతి చిన్న ఆధారం కూడా ఎంతో కీలకం అవుతుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కేసీ భాను వ్యాఖ్యానించారు. క్రిమినల్‌ కేసుల్లో క్లూ మిస్సవ్వకుండా జాగ్రత్త పడుతూనే సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరిం చాల్సి ఉంటుందని చెప్పారు. క్రిమినల్‌ లా ప్రాక్టీస్‌ చేసే న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పుల్ని, విచారణ కేసుల్ని లోతుగా అధ్యయనం చేస్తేనే విజయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

లైఫ్‌ లైన్‌ లాయ ర్స్‌ లెక్సికన్‌ ఆధ్వర్యంలో గురువారం ఫ్టాప్సీలో ‘నేర విచారణ–ఎఫ్‌ఐఆర్‌ నుంచి తీర్పు వరకు..’ అనే అంశంపై ఆయన ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పులను ఉదహరించారు. హైకోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.వినోద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కెయిత్‌ హాజరయ్యారు. జూనియర్‌ లాయర్లు నిరంతం అధ్యయనం చేయాలని, చిత్తశుద్ధి అవసరమని, అప్పుడే న్యాయవాదిగా రాణించవచ్చని సూచించారు.

ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, నిందితుల ప్రకటనల దగ్గర నుంచి ఆ కేసులోని అంశాని కి, ఇదే తరహాలోని ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాలు చెప్పిన తీర్పులను ఉటంకించి న్యాయపరమైన వాదనలు చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని సూచించారు. సుప్రీంకోర్టులో ఇద్దరు ముగ్గురు జడ్జీలతో కూడిన బెంచ్‌లు చెప్పిన తీర్పుల కంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు (విస్తృత ధర్మాసనాలు) చెప్పిన తీర్పుల్ని కేసుల్లో ఉదహరించాలని, అదే సమయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పులు వెలువరించిందో లేదో అధ్యయనం చేయకపోతే కేసు వీగిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

చేయి తగిలినా, బైక్‌ ఢీకొన్నా..
జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కెయిత్‌ మాట్లాడుతూ.. తెల్లారి లేచింది మొదలు చిన్నచిన్న సంఘటనలు కూడా కేసులైతే క్రిమినల్‌ లా వర్తిస్తుందని తెలిపారు. ఆడ పిల్లలకు చేయి తగిలినా, బైక్‌ ఢీకొన్నా.. కేసు నమోదైతే క్రిమినల్‌ లా అమలు అవుతుందని చెప్పారు. సిరిసిల్లలో పోలీసులు దళితుల్ని కొట్టిన ఘటన, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లా గరికపాడులో దళితుల గ్రామ బహిష్కరణ తదితర ఘటనల్లో వెంటనే స్పందించి బాధితుల పక్షాన నిలబడినట్లు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌ సభ్యుడు కె.రాములు చెప్పారు. సాంకేతికంగా వచ్చిన మార్పులను యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి హైకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.లక్ష్మణ్‌ సూచించారు. అంతకుముందు జస్టిస్‌ కేసీ భాను, రాములు, లక్ష్మణ్‌లను జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కెయిత్‌ సత్కరించారు.

Advertisement
Advertisement