అప్పుడే ‘కొత్త’ ఫీజులు!

10 Apr, 2017 00:20 IST|Sakshi
అప్పుడే ‘కొత్త’ ఫీజులు!

- నూతన విద్యా సంవత్సర ఫీజు వసూళ్లకు మార్చి నుంచే తెరలేపిన ప్రైవేటు స్కూళ్లు
- ఈ నెల వరకు ఫీజును తల్లిదండ్రులు గతేడాదే చెల్లించినా బేఖాతర్‌
- పైతరగతుల బోధన మొదలుపెట్టినందున కనీసం 25 శాతం చెల్లించాలని డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి మార్చి 21 నుంచే ప్రారంభమైన నూతన విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వరంగా, తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. వేసవి సెలవులకు ముందే పైతరగతుల బోధన ప్రారంభించినందున ఫీజుల్లో కనీసం 25 శాతాన్ని ఇప్పుడే చెల్లించాలని కొన్ని ప్రముఖ స్కూళ్లు తల్లిదండ్రులను డిమాండ్‌ చేస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు అయితే ఈ వేసవి సెలవుల ప్రారంభంలోగా (ఈ నెల 23లోగా) మొత్తం ఫీజు చెల్లిస్తే 10 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపు స్తకాలు, యూనిఫారాలు మొదలైనవి తమ వద్దే కొనాలని పట్టుబడుతున్నాయి.

ఈ నెలాఖరు వరకు ఫీజును గతేడాదే చెల్లించినా...
వాస్తవానికి 2016–17 విద్యాసంవత్సరంలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు తరగతులను కొనసాగించాలి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఇచ్చి 12న తిరిగి పాఠశాలలను తెరవాలి. ఇందుకు అనుగుణంగానే తల్లిదండ్రులు ఏప్రిల్‌ చివరి వరకు అయ్యే ఫీజులను ఇప్పటికే చెల్లించారు. అయితే ప్రభుత్వ ఆదేశం ప్రకారం యాజమాన్యాలు ఈసారి మార్చి 15 నాటికే గత సంవత్సర వార్షిక పరీక్షలను పూర్తి చేసి మార్చి 21 నుంచి పైతరగతుల బోధన ప్రారంభించినందున 2017–18 విద్యా సంవత్సరం ఫీజులను తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి జూన్, జూలైలలో ఈ ఫీజులను వసూలు చేయాల్సి ఉన్నా విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లకుండా ఉండేందుకు ముందుగానే ఫీజుల వసూళ్లకు తెరలేపాయి.

స్కూళ్లలోనే అధిక ధరలకు పుస్తకాల విక్రయాలు...
పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు, బూట్లు, యూనిఫారాలు మొదలైన వాటి విక్రయాల విషయంలోనూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. తమ వద్దే వాటిని కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే ఆరో∙తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలతోపాటు అదనంగా మరికొన్ని టైటిళ్లకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేసేలా తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తున్నాయి.

ఇక ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు అయితే పాఠశాల నిర్ణయించిందే పాఠ్య పుస్తకం. గతేడాది ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరించిన ప్రభుత్వం ఈసారి వదిలేసింది. దీంతో ఒక్కో పాఠశాల ఒక్కో పబ్లిషర్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం పాఠ్యపుస్తకాలు విక్రయించే 3, 4 షాపుల పేర్లను పాఠశాలలు తమ నోటీసు బోర్డుల్లో ప్రకటించాల్సి ఉన్నా ఏ స్కూలు యాజమాన్యం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.

మరిన్ని వార్తలు