చాందినిని చంపింది ప్రియుడే

13 Sep, 2017 01:44 IST|Sakshi
చాందినిని చంపింది ప్రియుడే

► ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య
►సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గుట్టల్లో లభించిన మృతదేహం
►కుళ్లిపోయిన స్థితిలో శరీరం.. కాళ్లు, ముఖంపై స్వల్ప గాయాలు
►చేతిపై టాటూ ఆధారంగా చాందినిగా గుర్తింపు
►ఓ యువకుడితో కలసి ఆ గుట్టలవైపు వెళ్లినట్లు పోలీసుల నిర్ధారణ
►నలుగురు అనుమానితులు అదుపులోకి..


హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మియాపూర్‌ కు చెందిన చాందిని జైన్‌ (17) అనే ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. శనివా రం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన ఆమె.. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపిం చింది. తెలిసిన యువకుడితో కలసి చాందిని ఆ గుట్టల వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తిం చారు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసి ఉండ వచ్చని భావిస్తున్నారు. నలుగురు అనుమాని తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిర్మానుష్యంగా ఉండే ఆ గుట్టల ప్రాంతంలో వీరిని గమనించిన కొందరు దుండగులు.. వారిపై దాడిచేసి ఉంటారని, చాందినిపై అత్యాచార యత్నం చేసి, చంపేసి ఉంటారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితులను కలసి వస్తానంటూ వెళ్లి..
మియాపూర్‌లోని మదీనాగూడలో ఉన్న సత్య నారాయణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యాపారవేత్త  కిషోర్‌జైన్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె అయిన చాందిని జై¯Œ బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ కళాశాలలో ఎంపీసీ సెకండియర్‌ చదువు తోంది. శనివారం కాలేజీ నుంచి తిరిగి వచ్చిన ఆమె... సాయంత్రం 5 గంటలకు స్నేహితుల దగ్గరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. కొంతసేపటి తర్వాత ఇంటికి ఫోన్‌ చేసి.. స్నేహితుల వద్ద ఉన్నానని, తిరిగి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పింది. కానీ రాత్రి 10 గంటల వరకూ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా స్విచాఫ్‌ వచ్చింది. దాంతో అనుమానం వచ్చి.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతరం అదే రోజు రాత్రి చాందిని సోదరి నివేదిత మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అమీన్‌పూర్‌లో మృతదేహం గుర్తింపు
సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గుట్టల ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచార మిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీ సులు.. గుర్తుతెలియని మృతదేహం లభించి నట్లుగా చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లకు సమా చారం అందించారు. దీంతో మియాపూర్‌ పోలీసులు వెళ్లి చాందినిగా గుర్తించారు. ఇదే సమయంలో అమీన్‌పూర్‌ పోలీసులు చాందిని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన చాందిని తల్లిదండ్రులు.. మృతదేహం ఎడమ చేతిపై ఉన్న టాటూ ఆధారంగా తమ కుమార్తెను గుర్తించారు.

వేగంగా దర్యాప్తు
చాందిని ఘటనకు సంబంధించి అమీన్‌పూర్‌ పోలీసులతోపాటు మియాపూర్‌ పోలీసులు, సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చాందిని ఫోన్‌కాల్‌ వివరాలను పరి శీలించారు. ఆమె సెల్‌ఫోన్‌ శనివారం సాయం త్రమే స్విచాఫ్‌ అయిందని, అంతకుముందు ఒక ఫోన్‌ నంబర్‌తో పదేపదే మాట్లాడిందని గుర్తించారు. ఇక ఘటనాస్థలికి దాదాపు 700 మీటర్ల దూరంలో ఓ రహదారి పక్కన ఉన్న ఇంటి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చాందిని శనివారం సాయంత్రం 5.28 గంట లకు ఓ యువకుడితో కలసి ఆటోలో అక్కడికి వచ్చిందని, అతడితో కలసి నిర్మానుష్యంగా ఉండే గుట్ట ప్రాంతం వైపు వెళ్లిందని గుర్తిం చారు. చాందినితో ఉన్న యువకుడు ఆ సమయంలో టీషర్ట్, షార్ట్స్‌ ధరించి ఉన్నాడు.

ఇక పోలీసులు ఘటనా స్థలిలో ఓ డెబిట్‌కార్డు, సమీపంలో కొన్ని మద్యం సీసాలు, ఖాళీ వాటర్‌ బాటిల్, ప్లాస్టిక్‌ గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. చాందిని మృతదేహంపై టాప్‌ లేకపోవడం, పక్కన పడి ఉండటాన్ని బట్టి ఆమెపై అత్యాచారయత్నం జరిగినట్లు అను మానిస్తున్నారు. నిందితులు చాందిని గొంతు నులిమి చంపినట్లు ప్రాథమికంగా భావిస్తు న్నారు. చాందిని అదృశ్యమైన శనివారం రోజున.. సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌ సమీపంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పరిచయస్తుడైన వ్యక్తితోనే చాందిని వెళ్లినట్లు తేలడంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చాందిని ఎవరితో వెళ్లిందనేది తేలాల్సి ఉందని.. అది నిర్ధారించ డానికి వారి ఫోన్‌కాల్‌ వివరాలు, లొకేషన్‌లను పరిశీలిస్తున్నామని చెబుతున్నారు.

మృతదేహంపై గాయాలు
చాందిని మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో మంగళవారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. మణికట్టుపై రోమ¯న్‌ భాషలో ఉన్న టాటూ ద్వారా మృతురాలిని చాందినిగా గుర్తించినట్లు పంచనామాలో నమోదు చేశారు. శనివారమే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని ఫోరెన్సిక్‌ వైద్యులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో ఉందని.. అందువల్ల మరణానికి కారణం ఏమిటన్నది ప్రాథమికంగా నిర్ధారించలేమని చెప్పారు. మృతదేహం రెండు కాళ్లతో పాటు ముఖంపైన గీరుడు గాయాలు ఉన్నాయని.. అంతకు మించి అంతర్గతంగా, బయటగానీ బలమైన గాయాలేవీ లేవని వెల్లడించారు. మరణానికి కారణాలు, చంపిన విధానం, లైంగికదాడి జరిగిందా లేదా అన్న అంశాలను తేల్చడానికి శరీరం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

బయటి వ్యక్తుల ఘాతుకమే!
విద్యార్థిని హత్య ఘటనకు సంబంధించి అమీన్‌పూర్‌ ప్రాంతంలో పలు రకాల ప్రచారం జరుగుతోంది. తనకు పరిచయస్తుడైన ఓ యువకుడితో కలసి చాందిని ఈ గుట్టల్లోకి వచ్చిందని.. అక్కడ వారిద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని మరెవరో చూసి ఉంటారని అంటున్నారు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆ దుండగులు యువకుడిపై దాడి చేసి.. చాందినిపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని, విషయం బయటపడకుండా చంపేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అమీన్‌పూర్‌ పోలీసులు.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ముమ్మాటికీ హత్యే..
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకు నేంత పిరికిది కాదని, ముమ్మాటికీ ఎవరో చేసిన ఘాతుకమేనని చాందిని తల్లిదం డ్రులు కిషోర్‌జైన్, కవిత పేర్కొన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించా లని డిమాండ్‌ చేశారు. తమకు ఎవరితో నూ విభేదాలు, గొడవలు లేవని చెప్పా రు. మంగళవారం పోస్టుమార్టం చేసిన అనంతరం చాందిని మృతదేహాన్ని తల్లి దండ్రులకు అప్పగించగా వారు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సత్యనారా యణ ఎన్‌క్లేవ్‌ వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.