ఆ ఆయుధం ఎక్కడ?

30 Jul, 2017 03:29 IST|Sakshi
విక్రమ్‌ దంపతులు (ఫైల్‌)
ముమ్మరంగా వెతుకుతున్న పోలీసు బృందాలు
- ఇద్దరు వచ్చి కాల్చారని చెప్పిన విక్రమ్‌గౌడ్‌
అతని వాంగ్మూలంపై పోలీసులకు అనుమానాలు
అవసరమైతే విక్రమ్‌కు నిజనిర్ధారణ పరీక్షలు
నా భర్త అన్ని వివరాలు చెప్పారు: షిపాలి
నిలకడగా విక్రమ్‌ ఆరోగ్యం: అపోలో వైద్యులు
 
సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాల్పులు జరిపిన ఆయుధంపై ప్రస్తుతం దృష్టి సారించారు. దీనికోసం ముమ్మరంగా వేట సాగిస్తున్న ప్రత్యేక బృందాలు.. అది అక్రమ ఆయుధమా? లైసెన్స్‌డ్‌ ఆయుధం దుర్వినియోగమా? అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు విక్రమ్‌ ఎట్టకేలకు శనివారం నోరు విప్పారు. అయితే తనపై ఆగంతకులు కాల్పులు జరిపారంటూ అతను చెప్తున్న విషయాలను పోలీసులు విశ్వసించట్లేదు. ఈ నేపథ్యంలో అవసరమైతే విక్రమ్‌కు నిజనిర్థారణ పరీక్షలు చేయాలని యోచిస్తున్నారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, క్లూస్, ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలనలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈ కాల్పులు మరో వ్యక్తి పాల్పడినవి కాదని, విక్రమ్‌ తనంతట తానుగా కాల్చుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా నిర్ధారించడానికి అతడి చేతుల నుంచి సేకరించిన గన్‌ షాట్‌ రెసిడ్యూ(జీఎస్సార్‌) స్వాబ్స్‌ పరీక్షలు పూర్తయి నివేదిక రావాల్సి ఉంది.

ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స నిమిత్తం వైద్యులు విక్రమ్‌ శరీరంతో పాటు చేతులపై ఉన్న రక్తాన్ని శుభ్రం చేశారు. దీంతో జీఎస్సార్‌ నమూనాలు లభించే ఆస్కారాలు తక్కువని భావిస్తున్న పోలీసులు.. కాల్పులకు వాడిన ఆయుధంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించాక అతడిని బంధువులు, స్నేహితుల్లో ఎవరెవరు కలిశారు? వారిలో ఎవరైనా తుపాకీ తీసుకువెళ్లారా? అనే అంశంపై దృష్టి పెట్టిన పోలీసులు ఆస్పత్రిలో రికార్డు అయిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విక్రమ్‌ ఇంటి వెనుక ఉన్న రాళ్లు, తుప్పల్లోనూ ఆయుధం కోసం గాలించినా ఫలితం దక్కలేదు.
 
అక్రమమా? దుర్వినియోగమా?
కాల్పులకు వినియోగించిన ఆయుధానికి సంబంధించి పోలీసులు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రాథమికంగా ఎవరిదైనా లైసెన్స్‌డ్‌ ఆయుధం దీనికి వినియోగించి తుపాకీని దుర్వినియోగపరిచారా? లేదంటే అక్రమ ఆయుధాన్ని తీసుకువచ్చి వాడారా? అనేది పరిశీలిస్తున్నారు. తుపాకీ దొరికితేనే ఈ వ్యవహారంలో అనేక చిక్కుముడులు వీడుతాయని చెప్తున్నారు. విక్రమ్‌ ఇంటి వాచ్‌మెన్‌ శ్రీనివాస్‌ను పోలీసులు రెండో రోజూ విచారించారు. ఘటనాస్థలిలో రక్తపు మరకలు ఎందుకు తుడిచారు? అలా చేయమని ఎవరైనా చెప్పారా? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన బుల్లెట్‌ ముందుభాగం ఆధారంగా పరిశీలన జరిపిన ఫోరెన్సిక్‌ నిపుణులు అది నాటు తుపాకీ అయి ఉండచ్చని అభిప్రాయ పడ్డారు. ఉదం తానికి సంబంధించి విక్రమ్‌ భార్య షిపాలి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు తప్పని తేలితే ఆమెపైనా కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. శుక్రవారం రాత్రి విక్రమ్‌ ఓ పబ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఏం జరిగిందనే అంశంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.
 
ఇద్దరు వచ్చి కాల్చారన్న విక్రమ్‌..
విక్రమ్‌గౌడ్‌ శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సరైన వివరాలు చెప్పలేదు. పోలీసులు ఎన్నిసార్లు అడిగినా తనను కాల్చింది ఎవరో తనకు తెలుసని, ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక చూసుకుంటానని చెప్తూ వచ్చాడు. విక్రమ్‌ కాస్త కోలుకున్న నేపథ్యంలో శనివారం పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. నోరు విప్పిన విక్రమ్‌ ఓ కథనాన్ని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున తాను డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారని, ఒకరు హెల్మెట్‌ పెట్టుకుని ఉండగా.. మరొకరు ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్నారని వివరించారు.

హెల్మెట్‌ ధరించిన వ్యక్తి తొలి రౌండ్‌ కాల్చగానే తాను కింద పడిపోయానని, ఆపై రెండో రౌండ్‌ కాల్చాడని తెలిపారు. మరో రౌండ్‌ కాల్చడానికి ప్రయత్నించగా వారి తుపాకీ స్ట్రక్‌ అయిందని చెప్పారు. తాను అరవటం, తన భార్య వస్తుండటం గమనించి వారు పారిపోయారని పేర్కొన్నారు. భూ, ఆర్థిక, రాజకీయ వివాదాల్లో ఏదైనా దీనికి కారణమై ఉండొ చ్చని పోలీసులకు తెలిపారు. అయితే ఈ కథనాన్ని పోలీసులు విశ్వసించట్లేదు. విక్రమ్‌ ఆస్పత్రి నుంచి డిస్చార్జ్‌ అయ్యే లోపు తుపాకీ ఆచూకీ లేకపోయినా, కేసు కొలిక్కి రాకున్నా అవసరమైన అనుమతుల తర్వాత అతనికి నిజనిర్ధారణ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. పోలీసులు ఆయన భార్య షిపాలిని మరోసారి విచారించగా తాను ఫిర్యాదులో పేర్కొన్నదే వాస్తవమంటూ చెప్పారు.
 
నా భర్త అన్ని వివరాలు చెప్పారు: షిపాలి
కాల్పుల ఘటనకు సంబంధించి విక్రమ్‌ భార్య షిపాలి శనివారం స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను విక్రమ్‌ పోలీసులకు తెలిపారని, పోలీసు శాఖపై తమకు పూర్తి నమ్మకముందని, ఘటనపై పోలీసులే అన్ని వివరాలు చెబుతారని అన్నారు. తన భర్తపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మీడియాను కోరారు.
 
ముకేశ్‌గౌడ్‌ పిస్టల్‌ స్వాధీనం..
కాల్పుల ఘటనలో దొరికిన తూటా, షెల్స్‌ 7.65 క్యాలిబర్‌కు చెందినవి. వీటిని .32 పిస్టల్‌లోనూ పెట్టి పేల్చే అవకాశం ఉందని బాలిస్టిక్‌ నిపుణులు స్పష్టం చేశారు. విక్రమ్‌ తండ్రి వద్ద ప్రస్తుతం ఈ క్యాలిబర్‌ లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ ఉంది. దీంతో ఆయనకు తెలియకుండా పిస్టల్‌ను ఇంట్లో నుంచి తెచ్చుకుని ఉంటాడా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి శుక్రవారం అర్ధరాత్రి ముఖేష్‌గౌడ్‌ ఇంటి నుంచి పిస్టల్‌ను తెప్పించిన పోలీసులు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. ప్రాథమిక పరిశీలన బట్టి విక్రమ్‌ కాల్పుల ఉదంతంలో ఈ ఆయుధం వాడలేదని గుర్తించినట్లు తెలిసింది. శనివారం సాయంత్రానికి ఈ ఉదంతంపై పోలీసులు ఓ స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఆదివారం అధికారికంగా ప్రకటించే ఆస్కారం ఉందని సమాచారం.
 
నిలకడగా విక్రమ్‌గౌడ్‌ ఆరోగ్యం
విక్రమ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం విక్రమ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయనకు నిరంతరం ఆక్సిజన్‌ అందిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే విక్రమ్‌ శరీరంలో ఉన్న బుల్లెట్‌ను ఇంకా వెలికితీయలేదన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా విక్రమ్‌ వైద్య ఖర్చుల బిల్లులు చెల్లించాల్సిందిగా తండ్రి ముఖేష్‌గౌడ్‌కు ఆస్పత్రి బిల్లును అందజేసింది. ఇప్పటి వరకు రూ.2.90 లక్షల బిల్లు అయిందని వెంటనే చెల్లించాలని ముఖేష్‌ను కోరింది.
మరిన్ని వార్తలు