రుణమాఫీ అవసరం రానప్పుడే నిజమైన స్వాతంత్య్రం

19 Sep, 2014 01:20 IST|Sakshi
రుణమాఫీ అవసరం రానప్పుడే నిజమైన స్వాతంత్య్రం

* రైతులకు ఇస్తున్న రుణాలపై వ్యవసాయ మంత్రి పోచారం వ్యాఖ్య
* ‘సిగ్గుపోతుంది ఏం చెప్పుకోవాలో’ అని వ్యవసాయ వర్సిటీపై విమర్శ


సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు రుణమాఫీ అవసరం రావొద్దు.. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లు. రైతులకు ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుం టున్నాయి. అది గొప్పకాదు. రైతుకు అప్పు అవసరంలేకుండా చేయడమే గొప్ప. అప్పుడే రైతు ఎదిగినట్లు’ అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

సీడ్స్‌మెన్ అసోసియేషన్ గురువారం నిర్వహించిన 19 వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతూ ‘మాది మేం చెప్పుకుంటే సిగ్గుపోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా కొత్త వం గడాలు బయటకు రావడం లేదు. అందులోనే ఉండిపోతున్నాయి’ అని విమర్శించారు. రైతు కు లాభసాటిగా ఉండే విత్తనాలను ఉత్పత్తి చే యాలని విత్తన కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.

23న మహారాష్ట్రకు పోచారం
మహారాష్ట్రలో చెరకు, స్ట్రాబెర్రీ పంటల సాగును పరిశీలించేందుకు ఈ నెల 23 నుంచి రెండ్రోజులపాటు మహారాష్ట్రలో పర్యటిస్తామని మం త్రి పోచారం గురువారం విలేకరులకు చె ప్పారు. నిజామాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎకరాకు 30 టన్నుల చెరకు పండిస్తుండగా పుణే, నాసిక్‌లలో 110 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. మహారాష్ట్రలో సాగును అధ్యయనం చేసేందుకు 4 బస్సుల్లో రైతులను అక్కడకు తీసుకెళ్తున్నామన్నారు. అలాగే పుణే సమీపంలోని మహాబళేశ్వరం వద్ద స్ట్రాబెర్రి సాగు చేస్తున్నారని దాన్ని కూడా అధ్యయనం చేసి వస్తామన్నారు.
 
కొత్త రుణాలిప్పించేందుకు కృషి
ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో రైతులకు కొత్త రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులను ఒప్పించే యత్నం చేస్తున్నామని మంత్రి  స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో రుణమాఫీపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు