స్టెరాయిడ్స్‌ వాడకాన్ని తగ్గించాలి: గవర్నర్‌

13 Mar, 2017 03:09 IST|Sakshi
స్టెరాయిడ్స్‌ వాడకాన్ని తగ్గించాలి: గవర్నర్‌

హైదరాబాద్‌: వైద్య చికిత్సల్లో స్టెరాయిడ్స్‌ వాడకాన్ని తగ్గిం చాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. స్టెరాయిడ్స్‌ వాడకం వల్ల దుష్పరిణామాలు అధికంగా ఉంటాయని అన్నారు. ఆదివారం ఇక్కడ గ్లకోమాపై అవగాహనలో భాగంగా బంజారాహిల్స్‌ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు అవేర్‌నెస్‌ వాక్‌ నిర్వహించారు. బెలూన్లు పట్టుకొని వాక్‌ చేస్తూ అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా జబ్బులకు సత్వర ఉపశమనం కోసం స్టెరాయిడ్స్‌ను అధికంగా వాడుతున్నారని, వైద్యుల సూచన లేకుండా వాటిని వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఐవీ తరహాలోనే గ్లకోమాపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సినిమా థియేటర్లలో, సామాజిక మాధ్యమాల్లో వీటిపై అవగాహన కల్పించాలని సూచిం చారు. ఆహారపు అలవాట్లు మార్చుకొని తద్వారా మెరుగైన జీవనాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్, గ్లకోమా విభాగ హెడ్‌ శిరీషా సెంథిల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు