శ్రీకాంత్ సాధించాడు

9 Apr, 2016 11:31 IST|Sakshi
శ్రీకాంత్ సాధించాడు

'నువ్వేమీ చేయలేవంది ప్రపంచం..నేను చేయలేనిదేమీ లేదని దానికి చెప్పా..' అంటాడు శ్రీకాంత్ బొల్లా. యాభై కోట్ల విలువ చేసే కంపెనీ, ఏడాదికి ఏడు కోట్ల రూపాయల టర్నోవర్, ప్రెస్, పబ్లికేషన్ సంస్థలు, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. ఇవన్నీ ఈయన సొంతం. కానీ, అవేవీ రాత్రికి రాత్రే సమకూరినవి కాదు. ప్రపంచంలోని ఏ వ్యక్తై సంపదలు సృష్టించగలడు. అయితే, ప్రపంచం అతన్ని విశ్వసించాలి. అతనిపై నమ్మకం ఉంచాలి. అప్పుడే అద్భుతాలు సాధ్యపడతాయి. కానీ, శ్రీకాంత్‌ను నమ్మేవారే లేరు. కారణం.. ఆయనో అంధుడు! అయితేనేం.. కార్యసాధకుడు!!

కృష్ణాజిల్లా సీతారామపురంకు చెందిన కష్టాలు, శ్రీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే.. నిజమేననిపిస్తుంది అతడి కథ విన్నాక! పుట్టుకతోనే కష్టాలతో సావాసం చేశాడీ యువకుడు. తల్లిదండ్రులు పేద రైతులు. 'గుడ్డివాడు పుట్టాడు. వీడినేం చేసుకుంటారు?'అన్నారు చాలామంది. మరికొందరు ఓ అడుగు ముందుకేసి, 'చంపేయండి. పీడ విరగడైపోతుంది' అంటూ సలహా ఇచ్చారు. దేవుడి ఆజ్ఞాపించాడో ఏమో.. ఆ తల్లిదండ్రులకు చేతులు రాలేదు. అలా బతికి బట్టకట్టాడు శ్రీకాంత్. 


మెల్లగా పెరిగి పెద్దయ్యాడు. బడికి వెళ్లే వయసు. ఎలాగో బడిలో చేర్చుకున్నారు గురువులు. కానీ, ఏనాడూ ముందు వరుస బెంచీల్లో అతన్ని కూర్చోనివ్వలేదు. వెనక బెంచీకే పరిమితం చేశారు. ఇక, ఆట పాటలకూ శ్రీకాంత్ దూరమే. తప్పు అతనిది కాదు. ఎవరూ అతన్ని ఆటల్లో చేర్చుకునేవారు కాదు. అదే కారణం! అయితే, ఇవేమీ అతన్ని పదో తరగతి పరీక్షల్లో స్కూలు ఫస్ట్ ర్యాంకు సాధించకుండా ఆపలేకపోయాయి.

తర్వాతి గమ్యం ఇంటర్మీడియట్.. కాలేజీ మెట్లెక్కుదామని సరదా పడ్డాడు. నేరుగా వెళ్లి, సైన్స్ గ్రూపులో చేరుతానంటూ ప్రిన్సిపాల్‌కు చెప్పాడు. దానికాయన అంగీకరించలేదు. 'పోయి, ఆర్ట్స్ గ్రూపులో చేరు' అంటూ సలహా ఇచ్చాడు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం అంధులు సైన్స్ గ్రూపులు ఎంచుకోవడానికి వీల్లేదు. ఆర్ట్స్‌లో ప్రవేశాలకు మాత్రమే వారు అర్హులు. అయితే, శ్రీకాంత్ పట్టువిడవలేదు. బోర్డుకు వ్యతిరేకంగా ఓ కేసు దాఖలు చేశాడు. అంతే.. ఆరు నెలల తర్వాత బోర్డు దిగివచ్చింది. శ్రీకాంత్‌కు సైన్స్ గ్రూపులో ప్రవేశమూ వచ్చింది. తనకు అవకాశమిచ్చినవారికి తానేమిటో చూపించాడు. 98 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నివ్వెరపోవడం అందరి వంతూ అయింది.

ఇక, శ్రీకాంత్ తదుపరి గమ్యం ఐఐటీలో ప్రవేశం పొందటం. దీని కోసం రేయింబవళ్లూ కష్టపడ్డాడు. కానీ, ప్రతిష్టాత్మక ఐఐటీలు శ్రీకాంత్‌ను స్వాగతించేందుకు సిద్ధంగా లేవు. అతనికి హాల్ టికెట్‌ను పంపించేందుకు నిరాకరించాయి. అంతే.. ఐఐటీల్లో ఇంజినీరింగ్ చదవాలన్న అతని కల నీరుగారిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాడు. 'నేను ఐఐటీలకు అవసరం లేకపోతే.. నేనూ వాటిని లెక్క చేయను' అని అమెరికావైపు చూశాడు. అక్కడి టాప్ కళాశాలలకు దరఖాస్తు చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత ఎమ్‌ఐటీ, స్టాన్‌ఫోర్డ్, బర్కెలీ, కార్నెగీ మెల్లాన్ కళాశాలలు శ్రీకాంత్‌కు ఆహ్వానం పలికాయి. వాటిలో ఎమ్‌ఐటీను ఎంచుకున్నాడు. ఆ కళాశాలకు తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా రికార్డు సృష్టించాడు.

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాలో బోలెడన్ని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగమిస్తామంటూ ముందుకొచ్చాయి. వాటన్నిటినీ వదిలేశాడు. నేరుగా భారత్‌కు వచ్చాడు. తనలాగే సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న వారి తరఫున బలంగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. తొలుత, ‘సమన్వయ్’ పేరిట హైదరాబాద్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. వికలాంగులకు సేవలందించడం మొదలుపెట్టాడు. అంధుల కోసం ఓ డిజిటల్ లైబ్రరీని, బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ని ఏర్పరచి, 3 వేల మందికి పైగా పాఠాలు చెప్పేవాడు.

2012లో శ్రీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వికలాంగులకు ఉద్యోగాలిచ్చే కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. అలా ప్రారంభమైందే ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’. పేపర్ అరిటాకులు, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లు ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు. వీటితో పాటే ప్రింటింగ్ ప్రొడక్టులను సైతం తయారుచేశారు. ఇదంతా చూసిన రవి మంతా లాంటి పెట్టుబడిదారులు భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతానికి శ్రీకాంత్ కంపెనీలో 150 మందికి పైగా వికలాంగులు పనిచేస్తున్నారు. వీరు సాగించే అమ్మకాలు ఏడాదికి రూ.7 కోట్ల పైమాటే! శ్రీకాంత్ ఇక్కడితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. భవిష్యత్‌లో మరో కంపెనీ తెరవాలనీ, అందులో 70 శాతం వికలాంగులే ఉద్యోగులుగా ఉండాలనీ ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అసాధ్యుడు కదా.. సాధించేస్తాడు!!
 

మరిన్ని వార్తలు