ఘనంగా పీడీఎస్‌యూ మహాసభలు ప్రారంభం

7 Jan, 2016 01:32 IST|Sakshi
ఘనంగా పీడీఎస్‌యూ మహాసభలు ప్రారంభం

భారీ ర్యాలీతో ఓయూకు.. ఎరుపుమయమైన రోడ్లు

 హైదరాబాద్: పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక విద్యానగర్ రోడ్డులోని స్వామి వివేకానంద బాలుర ఉన్నత పాఠశాలలో పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పస్క నర్సయ్య ర్యాలీని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పలు కళాశాలల నుంచి మాత్రమే కాక తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఎస్‌వీఎస్ పాఠశాలలో పీడీఎస్ సభ్యులు కాళ్లకు గజ్జెలు కట్టుకుని, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసి విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. వేలాది మంది విద్యార్థులు ఎస్‌వీఎస్ నుంచి భారీ ర్యాలీగా ఓయూకు తరలివెళ్లారు. విద్యార్థుల గజ్జెల చప్పుళ్లతో విద్యానగర్ రోడ్లన్నీ మార్మోగాయి.

ఎర్ర జెండాలతో రోడ్లన్నీ ఎరుపెక్కాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడు పస్క నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పీడీఎస్‌యూ మొట్టమొదటి రాష్ట్ర మహాసభలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ పాల్గొని సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు పరుశురాం, నగర అధ్యక్షుడు ఏడీ రామ్, రాష్ట్ర నాయకుడు రియాజ్, ఓయూ అధ్యక్షుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు