'ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను త్వరగా విచారించాలి'

17 Feb, 2016 03:52 IST|Sakshi
'ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను త్వరగా విచారించాలి'

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై తామిచ్చిన పిటిషన్లను త్వరగా విచారించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కోరారు. మంగళవారం స్పీకర్‌ మధుసూదనాచారిని.. రేవంత్‌ రెడ్డి, అరికెపుడి గాంధీ కలిశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వారు ఫిర్యాదు చేశారు. గతంలో పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీకి రాజీనామా చేసిన 10 మంది ఎమ్మెల్యేలంతా తమ టీమ్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎర్రబెల్లి దయాకరరావు ఇచ్చిన లేఖ తనకు అందిందని స్పీకర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలంతా తాము పార్టీకి రాజీనామా చేశామనే చెప్పారన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమదే టీడీఎల్పీ అని అనడంలో అర్థం లేదని.. ఆ వాదన చెల్లదని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

తమ ఫిర్యాదులను విచారించి... తామిచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్లను స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన కోరారు. ఎర్రబెల్లి టీమ్‌ ఇచ్చిన విలీన లేఖను పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. 1998లో మాయావతికి కూడా ఇదే పరిస్థితి ఎదురైందని, ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. బడ్జెట్‌ సెషన్స్‌లోపే స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని తాము భావిస్తున్నామని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. కౌన్సిల్‌లో టీడీపీ ఎమ్మెల్సీల విలీనం అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని చెప్పారు. మూడింట రెండొవంతు ఎమ్మెల్యేలు చీలిపోయినంత మాత్రానా.. వారు మరో పార్టీలో విలీనమన్నది రాజ్యాంగపరంగా చెల్లదని రేవంత్‌ స్పష్టం చేశారు. విలీనం అంటే శాసనసభా పక్షం కాదు.. మొత్తం పార్టీనే మరో పార్టీలోకి విలీనం కావాలని రేవంత్‌ రెడ్డి చెప్పారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ రాజీనామాపై ఏం నిర్ణయం తీసుకున్నారని రేవంత్‌ రెడ్డి స్పీకర్‌ను ఈ సందర్భంగా అడిగినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు