పండగకు ఊరెళ్లితే..!!

16 Jan, 2016 20:53 IST|Sakshi

నల్లకుంట: పండుగొస్తే చాలు పట్నంలో ఉండేవారి మనస్సు పల్లెల వైపు మళ్లుతుంది. పుట్టిపెరిగిన ఊరు గుర్తొస్తుంది. అక్కడ పండుగ జరిగే తీరు ముచ్చటగొలుపుతుంది. అందుకే పేరుకు నగరాల్లో నివసిస్తున్నా.. పండుగ అనగానే సొంతూరి వెళ్లాలని అంతా ఆశిస్తారు. ఇక సంక్రాంతి పండుగ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. ఇదేవిధంగా సంక్రాంతి పండుగ కోసం ఆనందంగా సొంతూరి వెళ్లివచ్చిన ఓ జంటకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇంటికి గట్టిగా తాళం వేసి ఊరికి వెళ్లినా.. తిరిగొచ్చేసరికి దొంగలు పడి ఇల్లును గుల్ల చేశారు. ఇంట్లో వారు దాచుకున్న రూ. 12వేలు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న గోకుల్ దేవీలాల్(25) భార్య విజయలక్ష్మితో కలిసి నల్లకుంట టీఆర్టీ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 10న ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి స్వగ్రామం ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం వెళ్లారు. తిరిగి శనివారం హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడిఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ. 12 వేల నగదు కూడా కనిపించలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన గోకుల్ దేవీలాల్ వెంటనే నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులుస కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు