రేపు రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్

25 Sep, 2016 00:49 IST|Sakshi
రేపు రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్

- ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లకు..
- 27వ తేదీ మధ్యాహ్నం సీట్ల కేటాయింపు..అదే రోజు చేరికకు గడువు
- ముగిసిన ప్రైవేటు బీ కేటగిరీ కౌన్సెలింగ్..ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం జరగనుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సుంది. మొదటి కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో మిగిలిన సీట్ల లెక్క తేలుతుంది. ఈ మిగిలిన సీట్లకే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు 27 మధ్యాహ్నంలోగా సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. అదే రోజు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే 28 మధ్యాహ్నం వరకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్‌సీసీ, ఆర్మీ కోటా సీట్లకు 26వ తేదీనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు అదేరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆప్షన్లు ఇవ్వాలని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

 ముగిసిన బీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్
 ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. సాయంత్రానికి ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఆ తర్వాత మిగిలిన బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. రాష్ట్రంలో 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 713 బీ కేటగిరీలో శుక్రవారం 384 ఎంబీబీఎస్ సీట్లు, ఏడు బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 329 ఎంబీబీఎస్ సీట్లు రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.వి.రావు ‘సాక్షి’కి తెలిపారు. ‘నీట్’లో 1,12,390వ ర్యాంకు విద్యార్థి చివరి ఎంబీబీఎస్ సీటు పొందాడు. సీటు పొందిన వారు ఈనెల 27 కల్లా కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అదేరోజు ఏడాది గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సీటును వదులుకోవాలనుకుంటే చెల్లించిన ఫీజులో 10% మినహాయించుకొని మిగతా సొమ్మును కాలేజీ యాజమాన్యాలు వెనక్కు ఇస్తాయి. ఎవరైనా బీ కేటగిరీ సీట్లల్లో చేరకుంటే వాటికి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు కాలేజీలకు మెమో జారీ చేస్తామని వైద్య మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు