నిర్లక్ష్యంతోనే ప్రాణాలు బలి

25 Jul, 2014 04:29 IST|Sakshi
నిర్లక్ష్యంతోనే ప్రాణాలు బలి

రాకాసి రైలు ముక్కు పచ్చలారని పాలబుగ్గలను చిదిమేసింది. అమాయక పిల్లల నిండు ప్రాణాలను బలిగొంది.
 ఎంతో మంది తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. తన చిన్నారులు ఇక లేరని, తిరిగి రార ని ఓ తండ్రి గుండె పోటుతో మృతి చెందడం చూస్తే గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం ముమ్మాటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యమేనని సర్వత్రా
 నిరసన వ్యక్తమవుతోంది.
 - సాక్షి నెట్‌వర్‌‌క
 
గార్డును నియమించాలి..
స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్లు ఓపికతో ఉండాలి. నిష్ణాతుల్ని యాజమాన్యం నియమించుకుంటే మంచిది. అదే విధంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద తప్పకుండా గార్డును నియమించాలి.
 -  తిరుమల, ఉపాధ్యాయురాలు
 
గేట్‌లను ఏర్పాటు చేయాలి
 రైల్వే ప్రమాద ఘటనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారత దేశ వ్యాప్తంగా దాదాపు 30 వేల రైల్వే క్రాసింగ్‌లు ఉండగా అందులో పదిహేను వేల వరకు గార్డులు లేని గేట్లే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే శాఖ రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్‌లను ఏర్పాటు చేయాలి.
 - నవీన్, కరస్పాండెంట్, కాకతీయ టెక్నో స్కూల్, రాంనగర్
 
డ్రైవర్‌దే తప్పు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా పెరిగిన రోజుల్లో కూడా రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. రైల్వే క్రాసింగ్ వద్ద రెండు వైపులా చూసుకొని బస్సు నడపకపోవడం డ్రైవర్‌దే తప్పు. రైలు వస్తుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్‌కు, క్లీనర్‌కు ఉండాలి.    - రూపాధరణి, విద్యార్థిని
 
ప్రమాదం జరిగినప్పుడే హడావుడి...
రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేటు, సిగ్నల్స్, గార్డును నియమిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదు. సంఘటనలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తారే తప్ప ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోరు.    
 - చప్పిడి సుభాన్‌రెడ్డి, నవీన విద్యా సంస్థల చైర్మన్
 
ఫిట్‌నెస్ చూడాలి
బస్సు ఫిట్‌నెస్‌ను ఎలా చూసుకుంటున్నామో డ్రైవర్ కూడా ఫిట్‌నెస్ కలిగి ఉన్నాడో లేడో చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలపై ఉన్నది. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.     - రామలింగం, ప్రిన్సిపాల్, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీనగర్‌కాలనీ
 
పునరావృతం కాకుండా చర్యలు...
నిర్లక్ష్యానికి కారకులు ఎవరైనప్పటికీ చనిపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురాలేరు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. - ఇ.సుష్మ, విద్యార్థిని

మరిన్ని వార్తలు