త్వరలోనే జీహెచ్‌ఎంసీలో భారీ బదిలీలు ?

7 Sep, 2016 22:18 IST|Sakshi

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో త్వరలో భారీ బదిలీలు జరుగనున్నాయి. దసరా నాటికి జీహెచ్‌ఎంసీలోని ప్రస్తుతం ఉన్న 24 సర్కిళ్లను 30 సర్కిళ్లుగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు దీర్ఘకాలంగా జీహెచ్‌ఎంసీలో చాలాకాలంగా ఓకే స్థానంలో వారిని బదిలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఐదారేళ్లకు పైబడి.. పదేళ్లు ఆపైన పనిచేస్తున్నవారి వివరాలు పంపించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. 

వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్‌ఎంసీకి వచ్చిన వారు ఏళ్ల తరబడి టౌన్‌ప్లానింగ్, ఆరోగ్యం- పారిశుధ్యం, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో పాతుకుపోయారు. డీటీసీపీ నుంచి వచ్చిన వారు టౌన్‌ప్లానింగ్‌లో, పబ్లిక్ హెల్త్ నుంచి వచ్చిన వారు ఇంజినీరింగ్ విభాగంలో, వైద్య ఆరోగ్యశాఖ నుంచి వచ్చిన వారు ఆరోగ్యం - పారిశుధ్యం విభాగాల్లో కొనసాగుతున్నారు. వారిలో అధిక శాతం భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఇటీవల ఏసీబీ దాడుల్లోనూ కోట్లకు కోట్లు అక్రమాస్తులు బయటపడుతున్నాయి. దాంతో దీర్ఘకాలంగా పని చేస్తున్నవారిని, అక్రమార్కులుగా పేరున్న వారిని బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నవారిని ఇతర కార్పొరేషన్లలోకి , ఇతర కార్పొరేషన్లలోని వారిని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసేందుకు వీలుగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను కూడా అమల్లోకి తేనున్నట్లు తెలిసింది. త్వరలో భారీ బదిలీలు జరుగనున్నాయని తెలిసే టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఇటీవల భారీగా కొత్త నియామకాలు జరిగినప్పటికీ వారిని తాత్కాలికంగా ఆయా పోస్టుల్లో నియమించారు తప్ప స్థిరమైన స్థానాలు కేటాయించలేదు.

డిప్యూటీ కమిషనర్లు సైతం ఒక్కరే రెండేసి సర్కిళ్లకు పని చేస్తున్నవారున్నారు. ఒకసారి బదిలీలన్నీ పూర్తయ్యాక, మిగిలి ఉండేవారిని బట్టి స్థిరమైన స్థానాల్లో కేటాయించాలనే యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగులతోపాటు ఐదారుగురు అడిషనల్/జోనల్ కమిషనర్లు సైతం బదిలీ కావచ్చునని తెలుస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీలో కీలకమైన సదరు పోస్టుల్లోనూ కొత్తవారు రానున్నారు.

మరిన్ని వార్తలు