‘రైల్వే’కు రెండు సివిల్స్ ర్యాంకులు

12 May, 2016 01:17 IST|Sakshi
‘రైల్వే’కు రెండు సివిల్స్ ర్యాంకులు

అభినందనలు తెలిపిన జీఎం రవీంద్రగుప్త

 సాక్షి, హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు రైల్వే ఉద్యోగుల పిల్లలు మెరుగైన ర్యాంకులు సాధించారు. విజయవాడ డివిజన్ సిగ్నల్స్ విభాగంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు రామకృష్ణ జాతీయ స్థాయిలో 84వ ర్యాంకు, సికింద్రాబాద్ రైల్‌నిలయంలో వర్క్ స్టడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న త్యాగరాజనాయుడు కుమారుడు విద్యాసాగర్ 101 వ ర్యాంకు సాధించారు. రామకృష్ణకు ఇది మూడోప్రయత్నం. 2013 తొలి ప్రయత్నంలో 257 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు అర్హతపొందాడు.

ఐపీఎస్ శిక్షణ అనంతరం పశ్చిమబెంగాల్ కేడర్‌లో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష రాయగా 260 ర్యాంకుతో ఐఆర్‌ఎస్ సాధించారు. ఈసారి 84వ ర్యాంకుతో ఐఏఎస్ అవకాశాన్ని మెరుగుపరుచుకున్నారు. విద్యాసాగర్ రెండో ప్రయత్నంలో 101వ ర్యాంకు పొందారు. కాగా, క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరుస్తున్న రైల్వే ఇప్పుడు ఉన్నత చదువుల్లో కూడా సత్తా చాటడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త హర్షం వ్యక్తం చేశారు. తాజా సివిల్స్ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు పొందిన ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు.

>
మరిన్ని వార్తలు