చెరువులను అన్యాక్రాంతం కానివ్వం

8 May, 2016 18:54 IST|Sakshi

తెలంగాణ రాష్ట్రంలోని చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే చెరువుల పునరుద్దరణ, సుందరీకరణకు భారీగా నిధులను ఖర్చు చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. ఆదివారం ఆయన సరూర్‌నగర్ మండలం మీర్‌పేట్‌లోని మంత్రాల చెరువు ఆధునీకరణ పనులను ప్రారంభించారు. రూ. 1.40కోట్ల నార్త్‌ట్యాంక్ నిధులతో ఇక్కడి చెరువును ఆధునీకరించనున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గత పాలకుల పరిపాలన వైఫ్యల్యాల కారణంగా చెరువును పరాధీనం అయ్యాయని...ఇకపై అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వరాదన్న ముందు చూపుతో చెరువుల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోందన్నారు. నాగరీకతకు ఆలావాలమైన తెలంగాణ చెరువులన్నింటికి పూర్వవైభవం తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మళ్లీ చెరువుకట్టలపై మహిళలు బతుకమ్మలు ఆడతారని, చెరువులో బతుకమ్మలను సాగనంపుతారని, సీనియర్ సిటీజన్స్ మాటా, ముచ్చటలు చెప్పుకుంటూ నడక సాగిస్తారని.. మొత్తంగా చెరువులన్నికూడా ఆహల్లాదకరమైన వాతావరణం పంచే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన పాలన కేవలం ప్రజలకేమాత్రం ప్రయోజనం చేకూర్చలేదని ఇంకా నైజాం కాలం నాటి ఆసుపత్రులు మినహా ప్రభుత్వ వైద్యం పేదల చెంతకు చేరలేదన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రం ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వం ఆసుపత్రులను నెలకొల్పేందుకు సంకల్పించిందన్నారు. ఈకార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశరరెడ్డి, శాసన మండలి సభ్యులు జనార్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శంబీపూర్‌రాజు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు