‘బాధ’వారం!

16 Jun, 2016 23:53 IST|Sakshi
‘బాధ’వారం!

చోరీల్లో అత్యధికం జరిగింది బుధవారం రోజునే
విశ్లేషించి స్పష్టం చేసిన ‘హైదరాబాద్ కాప్’

నిరోధానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు

 

 సిటీబ్యూరో:  ‘లైఫ్‌స్టైల్’ భవనం యజమాని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో రూ.1.33 కోట్ల ‘చోరీ’... జేఎన్టీయూలో విద్యనభ్యసిస్తున్న నైజీరియా విద్యార్థి రూమ్‌లో రూ.3.5 లక్షల చోరీ... ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంగీత మొబైల్స్ దుకాణంలో రూ.10 లక్షల సొత్తు చోరీ... బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఇంటి ముందు పార్క్ చేసిన ఎర్టిగా కారు చోరీ...


నగరంలో బుధవారం చోటు చేసుకున్న దొంగతనాలకు ఉదాహరణలివి. కేవలం ఇవి మాత్రమే కాదు సిటీలో జరుగుతున్న చోరీల్లో అత్యధికంగా ఈ వారమే జరుగుతుండటంతో ‘వెన్స్‌డే’ బాధితులకు ‘బాధావారం’గా మారిపోయింది. నగర పోలీసు ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్ ‘హైదరాబాద్ కాప్’ ద్వారా ఈ అంశాన్ని గుర్తించిన అధికారులు కారణాలు విశ్లేషిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు.

 
‘కాప్’ విశ్లేషణలో వెలుగులోకి...
నగర పోలీసులు ఈ యాప్‌లో నేరాలు జరిగే క్రైమ్ ప్రోన్ ఏరియాలతో పాటు అవి జరిగే సమయాలు, రోజుల్నీ నమోదు చేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఈ వివరాలను యాప్‌కు సంబంధించిన సర్వర్‌లోని ఎంట్రీ చేయిస్తున్న అధికారులు నేరాల  నిరోధం కోసం వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు జరిగిన నేరాలను ఈ యాప్ సహాయంతో అధ్యయనం చేసిన పోలీసు విభాగం అత్యధిక నేరాలు బుధవారమే జరిగినట్లు గుర్తించారు.

 
వలస దొంగలకు అనుకూలం...

ఈ రోజునే నేరాలు చోటు చేసుకోవడానికి కారణాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా ‘వలస దొంగలకు’ కలిసొచ్చే అంశంగా మారిందని చెప్తున్నారు. నగరంలో నేరాలు చేస్తున్న చోరుల్లో బయటి ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారూ ఎక్కువగానే ఉంటున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో అంతా ఇంట్లోనే ఉంటారనే ఉద్దేశంతో వీరు ఆ రోజుల్లో, దానికి ముందు సిటీకి రావట్లేదని భావిస్తున్నారు. సోమవారం నగరానికి చేరుకునే వలస దొంగలు మంగళవారం రెక్కీ చేసి బుధవారం ‘పని’ పూర్తి చేసుకునే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణాన్ని నిర్థారించడానికి కేసుల వారీగా లోతైన అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్నారు.

 
గస్తీ విధానంలో మార్పుచేర్పులు...

ఈ యాప్ ద్వారా నేరాలు జరిగే ప్రాంతాలు, రోజులు, సమయాలను గుర్తించిన అధికారులు దానికి అనుగుణంగా గస్తీ విధానంలో మార్పుచేర్పులు చేస్తున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలను జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది పక్కాగా జరుగుతోందా? లేదా? అనే అంశాన్నీ సాంకేతికంగానే పర్యవేక్షిస్తున్నారు.

 
మూడు నెలల గణాంకాలు ఇలా...

నమోదైన మొత్తం సొత్తు సంబంధ నేరాలు:      704
నేరాల్లో రకాలు సాధారణ చోరీలు: 310
వాహనచోరీలు:     215
ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలు: 30
ఇళ్లల్లో రాత్రి వేళ దొంగతనాలు:    58
దృష్టి మళ్లించే నేరాలు:38

 

మరిన్ని వార్తలు