ఓచర్ రాసిస్తానని టోకరా | Sakshi
Sakshi News home page

ఓచర్ రాసిస్తానని టోకరా

Published Thu, Jun 16 2016 11:38 PM

ఓచర్ రాసిస్తానని టోకరా - Sakshi

నమ్మించి రూ.1.24లక్షలతో ఉడాయింపు
ములుగు ఎస్‌బీఐలో ఘటన

 ములుగు : బ్యాంక్ ఉద్యోగిని అంటూ నమ్మించి ఓ గుర్తు తెలియని ఘరానా మోసగాడు రైతును మోసగించి రూ. 1.24 లక్షలతో ఉడాయించిన సంఘటన స్థానిక ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు, ములుగు పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. మండలంలోని భవానందపూర్ గ్రామానికి చెందిన రైతు కొండి సత్యనారాయణ రూ. 1.24 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఉదయం 11 గంటలకు ములుగు ఎస్‌బీఐకి వచ్చాడు.

అయితే డబ్బులు డిపాజిట్ చేసేందుకు సంబంధించిన ఓచరును రాసేందుకు బ్యాంక్‌లో తెలిసిన ఒక వ్యక్తిని కోరాడు. ఇది గమనించిన ఓ గుర్తు తెలియని ఆగంతకుడు సత్యనారాయణ వద్దకు వచ్చి డబ్బులు డిపాజిట్ చేస్తావా అని అడిగాడు. దీంతో ఔను అని సత్యనారాయణ చెప్పాడు. సత్యనారాయణతో మాటలు కలిపిన ఆగంతకుడు డిపాజిట్ చేసే డబ్బులకు సంబంధించిన ఓచరును పూర్తి చేశాడు. ఆ తరువాత ఆగంతకుడు బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లి రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి అని చెప్పాడు. దీంతో డిపాజిట్ చేసేందుకు పాన్‌కార్డు అవసరమని మేనేజర్ చెప్పారు. సరేనంటూ వెళ్లిపోయిన ఆగంతకుడు సత్యనారాయణను దగ్గరకు పిలుచుకుని డబ్బులు డిపాజిట్ చేయాలంటే పాన్‌కార్డుతో పాటు మరో ఫాం అవసరముంటుందని చేతిపైన ఓ నంబర్‌ను రాశాడు.

తాను రాసిన ఫాంను పోస్టాఫీస్‌కు వెళ్లి తేవాల్సి ఉంటుందని నమ్మబలికాడు. సరేనంటూ సత్యనారాయణ చెప్పడంతో ఆ డబ్బులు తన దగ్గర పెట్టి వెళ్లమని యువకుడు సూచించాడు. దీంతో సత్యనారాయణ తన వద్ద వున్న రూ. 1.24 లక్షలు గుర్తు తెలియని ఆ యువకుడికి ఇచ్చి వెళ్లాడు. గుడ్డిగా నమ్మిన సత్యనారాాయణ సగం దూరం వెళ్లి తిరిగి బ్యాంక్ వద్దకు వచ్చి చూడగా అప్పటికే ఆ ఆగంతకుడు డబ్బులతో పరారయ్యాడు. బ్యాంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డైన ఆగంతకుడి పుటేజీని పరిశీలించిన ఎస్సై శ్రీశైలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 సిద్దిపేట బ్యాంక్‌లో మహిళ వద్ద ..
సిద్దిపేట క్రైం: డబ్బులు పొదుపు చేయడానికి బ్యాంక్‌కు వచ్చిన ఓ మహిళ వద్ద గుర్తు తెలియని దుండగుడు డబ్బులు అపహరించిన సంఘటన గురువారం పట్టణంలోని ఎస్‌బీహెచ్ బ్రాంచ్-2లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి పొదుపు సంఘంలో డబ్బులు వేయడానికి పట్టణంలోని ఎస్‌బీహెచ్ బ్రాంచ్-2కు వచ్చింది. ఈ క్రమంలో బ్యాంక్‌లో ఓచర్ రాయాల్సి ఉండడంతో అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని అడిగింది. దీంతో అతడు తానే ఓచర్ రాసిస్తానని చెప్పాడు.

వెంటనే ఓచర్ రాసి డబ్బులు లెక్కపెడతానని తీసుకొని రూ. 11వేలు అపహరించుకెళ్లాడు. దీంతో బాధితురాలు బ్యాంక్ అధికారులను సంప్రదించింది. ఈ బ్యాంక్‌లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని సిబ్బంది చెప్పడం గమనార్హం. ఈ విషయంపై టూటౌన్ సీఐ సైదులును అడగగా, బ్యాంక్‌లో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, దానిపై దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. ఇంకా బాధితురాలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

Advertisement
Advertisement