9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

5 Dec, 2016 15:16 IST|Sakshi
9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

హైదరాబాద్ :  పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 9న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో సోమవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంపై ఆరు జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు.

రైతు, డ్వాక్రా రుణమాఫీ, కరువుతో పాటు నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నేతలు హాజరయ్యారని.. సమావేశానికి రాలేకపోయిన కో ఆర్డినేటర్లతో ఈ నెల 17న మరోసారి భేటీ అవుతామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైఎస్ జగన్ నేతలకు సూచించారని చెప్పారు. మంత్రి దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. పిచ్చిగా మాట్లాడితే కృష్ణాజిల్లా రైతాంగమే ఉమను తరిమి కొడతారని పార్థసారథి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు