ఇథియోపియాలో కూలిన విమానం

11 Mar, 2019 04:12 IST|Sakshi
విమానం కూలిన ఘటనలో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం

సిబ్బంది, ప్రయాణికులు సహా 157 మంది మృతి

అడిస్‌ అబాబా నుంచి నైరోబి వెళ్తుండగా దుర్ఘటన

మృతుల్లో నలుగురు భారతీయులు

అడిస్‌ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది.

బయల్దేరిన ఆరు నిమిషాలకే..
అడిస్‌ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్‌ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ ఎమర్జెన్సీ కాల్‌ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్‌ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్‌ ట్రాఫిక్‌ మానిటర్‌ వెల్లడించారు.

ప్రమాదానికి గురైన విమానం బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ గత నవంబర్‌లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్‌  దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్‌ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున  ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్‌ విచారం వ్యక్తం చేసింది.

భారతీయ మృతుల గుర్తింపు..
విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్‌ శిఖా గార్గ్‌ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చెప్పారు. గార్గ్‌  యూఎన్‌ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్‌ భాస్కర్, వైద్య హాసిన్‌ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు