ఈ టోపీ పళ్లు తోముతుంది!

7 Feb, 2014 05:14 IST|Sakshi
ఈ టోపీ పళ్లు తోముతుంది!

లండన్: ఓ పక్క టూత్‌పేస్టు, మరో పక్క బ్రష్ అమర్చి ఉన్న ఈ టోపీ నిజంగానే పళ్లు తోముతుందట! పొద్దున లేవగానే దీన్ని తలపై పెట్టుకుని పళ్లు తోముకుంటూనే ఎంచక్కా ఇంకో పని చేసుకోవచ్చట. బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీలో సంగీతం నేర్చుకుంటున్న శ్యాం హంటర్ బాక్స్‌టర్ అనే విద్యార్థి దీనిని రూపొందించాడు. రోజూ పళ్లు తోముకోవడానికి సమయం వ్యర్థం అయిపోతోందని భావించిన ఈ 19 ఏళ్ల గడుగ్గాయి.. జీవితకాలంలో దంతధావనానికి ఎన్ని రోజుల సమయం వ్యర్థం అవుతుందోనని ఓ రోజు లెక్కలేసుకున్నాడు. మొత్తమ్మీద 75 రోజులని తేలింది.
 
  ఇంకేం.. చేతులతో పనిలేకుండానే దంతధావనం చేసుకునేందుకు ఉపయోగపడేలా ఈ టోపీని తయారు చేశాడు. అన్నట్టు.. ‘విచిత్ర ఆవిష్కరణల పోటీ’లో ఈ టోపీకి రూ.10 లక్షల బహుమతి కూడా దక్కింది! ఇంటితాళాలు దాచుకునే హీల్స్, బ్రెడ్ ఆకారంలోని రేజర్, మినీట్రెడ్‌మిల్స్‌లా పనిచేసే రోలర్స్ బూట్లు, పాదాల వరకూ విస్తరించే గొడుగు వంటి మొత్తం 300 విచిత్ర ఆవిష్కరణలను పోటీలో వెనక్కు నెట్టి మరీ ఈ టోపీ ప్రైజ్‌ను కొట్టేసింది. దీనిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారట.

మరిన్ని వార్తలు