అమెరికా వీసా కావాలంటే.. వారు పెళ్లి చేసుకోవాల్సిందే

2 Oct, 2018 21:04 IST|Sakshi

న్యూయార్క్‌ : వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, ఐక్యరాజ్యసమితిలో విధులు నిర్వహిస్తున్న అవివాహితులైన స్వలింగ భాగస్వాములకు అమెరికా వీసా కఠినతరం అయింది. స్వలింగ భాగస్వాములు వీసా పొందాలంటే వారు ఖచ్చితంగా వివాహం చేసుకొని ఉండాలని నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. దీనికి సంబంధించిన పాలసీ సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, ఐక్యరాజ్యసమితి ఉద్యోగుల్లో ఎవరైనా వివాహం కాని స్వలింగ భాగస్వాములు ఉంటే వారు ఈ ఏడాది చివరి వరకు వివాహమైనా చేసుకోవాలని లేదా దేశం వదిలి వెళ్లాలని స్పష్టమైనా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి ఓ సర్క్యూలర్‌ కూడా వెళ్లింది.

ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికీ స్వలింగ సంపర్కానికి మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలను విధిస్తున్నారు. చాలా మంది స్వలింగ భాగస్వాములు వారి వారి దేశాల్లో ఇప్పటికే న్యాయ విచారణను కూడా ఎదుర్కుంటున్నారు. కొత్త నిబంధనలతో ఇప్పటికే అమెరికాలో దౌత్యవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో ఎంతమందిపై ఈ ప్రభావం పడనుందో తెలియాల్సి ఉంది.

మరోవైపు అమెరికాలో చట్టబద్ధంగా నివసించేందుకు గడువుతీరిన వలసదారులను వెనక్కి పంపేందుకు రంగం సిద్ధమైంది. వీసా పొడిగింపునకు, మార్పులు చేసుకునేందుకు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిని స్వదేశాలకు పంపే ప్రక్రియ అక్టోబర్‌ 1(సోమవారం) నుంచే ప్రారంభమైంది. అయితే హెచ్‌–1బీ వీసాదారులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా, ఉపాధి, శరణార్థులకు సంబంధించిన పిటిషన్‌లకు ఇప్పట్లో ఈ విధానాన్ని అమలు చేయబోవట్లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టతనిచ్చింది.

మరిన్ని వార్తలు