ఆపరేషన్‌ థాయ్‌; మరో నలుగురు క్షేమం

9 Jul, 2018 20:42 IST|Sakshi

మే సాయ్‌ : థాయ్‌లాండ్‌లోని తామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకు రాగా, సోమవారం నాడు మరో నలుగురిని కాపాడినట్లు తెలిసింది. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గుహ నుంచి క్షేమంగా బయటపడిన విద్యార్థుల పేర్లను మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. దాంతో గుహ నుంచి బయటపడినవారిలో తమ పిల్లలు ఉన్నారా? లేదా? అనే విషయం తల్లిదండ్రులకు ఇంతవరకూ తెలియలేదు.

ఈ విషయం గురించి తల్లిదండ్రులు ‘మా పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాం. అందుకే మిగతా వారిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చే వరకూ ఇక్కడే ఉంటాం’ అని తెలిపారు. అయితే విద్యార్ధులను తల్లిదండ్రుల వద్దకు పంపించకుండా ఉండటానికి కారణం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ విషయం గురించి థాయ్‌లాండ్‌ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్‌ జెస్సడ చోకేడమాంగ్‌సూక్‌ ‘విద్యార్ధులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ముందు కొన్ని రోజుల పాటు వారిని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం మంచిది. ఎందుకంటే ఇన్నిరోజులు వారు గుహలో అసాధారణ పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఒకటి, రెండు రోజులు పరీక్షించి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పిల్లల్ని తిరిగి వారి కుటుంబాల చెంతకు చేరుస్తాం’ అన్నారు. 

ఈ విషయం గురించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటి సైకాలజిస్ట్‌ డాక్టర్‌ జెన్నిఫర్‌ వైల్డ్‌ ‘గుహ నుంచి క్షేమంగా బయటపడిన వారు మిగతా వారి గురించి ఆలోచించడం అవసరం. ఎందుకంటే వారి మిత్రులు ఇంకా గుహలోనే ఉన్నారు. కనుక వారంతా బయటకొచ్చిన తర్వాత అందరిని ఒకే సారి వారి కుటుంబాల చెంతకు చేర్చడం మంచిది అన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరంగా ఉంచడం బాధకరమైన విషయమే. కానీ ఇది వారు ఒకరికోసం ఒకరు ఆలోచించాల్సిన సమయం. అందరూ క్షేమంగా బయటపడిన తర్వాత వారు కలసికట్టుగా ముందుకు సాగడం గురించి ఆలోచించాలి’ అన్నారు. అంతేకాక ‘ఇన్ని రోజులు గుహలో ఉండి బయటపడిన తర్వాత వారికి కొన్ని ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. కొందరు ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేక పోవచ్చు. ఒత్తిడి వల్ల తలనొప్పి, కడుపునొప్పి వంటి అనారోగ్యాలు కలగవచ్చు. అందుకే పిల్లలను కొన్నాళ్ల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం అవసరం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు