ఆమె డ్రైవరే దేశాధ్యక్షుడు!

10 Mar, 2016 19:18 IST|Sakshi
ఆమె డ్రైవరే దేశాధ్యక్షుడు!

నెపిడా: మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా హితిన్ చా పేరును ప్రకటించారు. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ తమ అధినేతగా ఆంగ్ సాన్ సూచీ చిన్ననాటి స్నేహితుడు, సన్నిహితుడైన హితిన్ చా ను ఎన్నుకున్నారు. ఆయన గతంలో డ్రైవర్ గా విధులు నిర్వహించడం గమనార్హం. సూచీ ఉద్యమం చేస్తున్న సమయంలో ఆమెకు డ్రైవర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆంగ్ సాన్ సూచీ చారిటీ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, మిలిటరీ ఆధిపత్యాన్ని తప్పించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముగిశాయి. అందుకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వారసత్వాన్ని హితిన్ కు కట్టబెట్టాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో ఆంగ్ సాన్ సూచీ వెల్లడించారు.

ఇక్కడ మన్మోహన్.. అక్కడ హితిన్ చా
గతంలో యూపీఏ ప్రభుత్వం గెలిచినప్పటికీ విదేశీ అనే ఆరోపణలు వచ్చి వ్యతిరేకత రావడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని పగ్గాలను విశ్వాసపాత్రుడైన మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఇప్పుడు మయన్మార్ లో అదే సీన్ రిపీట్ అయింది. నిబంధనల వల్ల సూచీ విదేశీ కావడంతో పాలన పగ్గాలను సన్నిహితుడు, మిత్రుడు హితిన్ చా చేతిలో పెట్టారు.

నిర్ణయాలు మాత్రం సూచీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అధ్యక్ష పదవి కంటే పెద్ద స్థానంలోనే సూచీ ఉందని నేతలు పేర్కొంటున్నారు. అధ్యక్షుడి ఎన్నికపై సూచీ సొంత పార్టీ ఎన్ఎల్డీ లో కూడా కాస్త వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో మరో అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ పార్టీ ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఓట్లతో హితిన్ చా కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడి భార్య అధికార పార్టీ ఎన్ఎల్డీ ఎంపీ. ఆమె పేరు సు సు లిన్. గతంలో ఆమె తండ్రి ఎన్ఎల్డీ పార్టీ అధికారప్రతినిధిగా పనిచేశారు.

సూచీని అడ్డుకున్న రాజ్యాంగం!
గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త  బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు పిల్లలు. మయన్మార్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజ్య నియమాలకు కట్టుబడి అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపలేదు.

మరిన్ని వార్తలు