టిబెటన్లపై మరోసారి చైనా ఉక్కుపాదం

6 Jan, 2017 14:23 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా వేలమంది టిబెటన్లను అడ్డుకుంటోంది. బోధ్‌ గయలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకాకుండా వారిని నిలువరిస్తోంది. ఈ కార్యక్రమానికి చైనాకు బద్ధ విరోధి అయిన ప్రముఖ బౌద్ధమత గురువు దలై లామా హాజరు అవుతుండటమే అందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని నేపాల్‌, చైనా మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ప్రత్యేకవాదం, ఉగ్రవాదం మితిమీరుతుందనే కారణంతో ఇటీవల చైనా పలు ట్రావెలింగ్‌ పరిమితులు ప్రవేశపెట్టినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ చెప్పింది.

ఇలాంటి నిబంధనలు గతంలో ఒక్కసారి కూడా ఉండేవి కావని, ఇటీవల ఉన్న పలంగా ప్రవేశపెట్టారని కూడా అది పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే చైనా ఆధీనంలోని టిబెట్‌ వాసుల దగ్గర నుంచి పాస్‌పోర్ట్‌లను చైనా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని కూడా తెలిసింది. గత ఏడాది (2016) నవంబర్‌ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు చైనా మీడియానే స్వయంగా తెలిపింది. 'ప్రత్యేకంగా నేపాల్‌కు టిబెటన్లు చేసే ప్రయాణాలపై తాత్కాలికంగా పరిమితులు విధించారు. జనవరి 10 వరకు ఎలాంటి టికెట్‌ బుకింగ్‌లు చేయవద్దని ఉన్నపలంగా తమ ఆదేశాలు అమలు చేయాలని ఎయిర్‌లైన్స్‌, ఇతర మార్గాలకు సంబంధించిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటుచేసే సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది' అని నేపాల్‌ మీడియా వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు