ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు

22 Sep, 2016 11:30 IST|Sakshi
ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు

పాకిస్థాన్ కుటియత్నానికి ఐక్యరాజ్యసమితిలో మరోసారి చుక్కెదురైంది. కశ్మీర్ సమస్యకు ఏవేవో రంగులు పూసి, దాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి, ఆ సమస్య పరిష్కారంలో వివిధ దేశాలతో వేలు పెట్టించాలనుకున్న ఆ దేశ ప్రయత్నానికి మళ్లీ గండిపడింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటూ పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అది ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం అవ్వాల్సిన సమస్య అని, భారత్-పాక్ దానిపై చర్చించుకోవాలని నవాజ్ షరీఫ్‌కు స్పష్టం చేశారు. ఇది ఆ రెండు దేశాల ప్రయోజనాలతో పాటు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనాలకు మేలు చేస్తుందని తెలిపారు.

కశ్మీరీలపై మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, భారత సైన్యం అక్కడ అఘాయిత్యాలు చేస్తోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన వివరాలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. బాన్‌ కీ మూన్ కు అందించారు. కశ్మీర్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన హత్యలపై స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు.

అయితే, ఎన్నిసార్లు ఐక్యరాజ్యసమితిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని చూసినా పాకిస్థాన్‌కు మాత్రం భంగపాటు తప్పడం లేదు. ఈసారి కూడా సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మరోసారి పాక్‌ వాదనను తిప్పికొట్టారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య మాత్రమేనని, అందువల్ల ఇందులో అంతర్జాతీయ జోక్యానికి తావులేదని తెలిపారు. అలాగే ఆయన తన ప్రసంగంలో కూడా ఎక్కడా కశ్మీర్ అంశాన్ని అస్సలు ప్రస్తావించలేదు. మయన్మార్, శ్రీలంకలలో నెలకొన్న పరిస్థితులు, కొరియన్ ద్వీపంలో, మధ్యప్రాచ్యంలో అస్థిరతను గురించి మాట్లాడారు తప్ప కశ్మీర్ ఊసెత్తలేదు. ఇది పాకిస్థాన్‌కు పెద్ద భంగపాటుగా మిగిలింది. నవాజ్ షరీఫ్ మాత్రం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడేటప్పుడు కశ్మీర్ సమస్యను ఐరాస పరిష్కరించాలని కోరారు. కేవలం భారత్, పాక్ రెండు దేశాలూ కోరితే మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారానికి తమవంతు సాయం అందిస్తామని బాన్‌ కీ మూన్ కార్యాలయం ఇంతకుముందు కూడా పలుమార్లు తెలిపింది.

>
మరిన్ని వార్తలు