28 ఏళ్ల క్రితం పోయింది.. ఇప్పుడు కంట్లో దొరికింది

17 Aug, 2018 13:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : కంట్లో ఏదో ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు విస్తుపోయే వార్త చెప్పారు డాక్టర్లు. వైద్యులు చెప్పిన విషయం ఆమెనే కాకా నెటిజన్లను కూడా వామ్మో అనేలా చేసింది. విషమేంటంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతోంది. దాంతో వైద్యులను సంప్రదించింది. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యులకు ఆమె కంటిలో ఒక లెన్స్‌ ఉన్నట్లు తెలిసింది. అందువల్లే ఆమెకు ఇబ్బంది తలెత్తిందని, ఆపరేషన్‌ చేసి లెన్స్‌ను తొలగించాలని చెప్పారు డాక్టర్లు. సర్జరీ అనంతరం బయటకు తీసిన లెన్స్‌ వయసు నిర్థారించిన వైద్యులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ లెన్స్‌ వయసు 28 ఏళ్లు. అంటే దాదాపు 30 ఏళ్లపాటు ఆ మహిళ లెన్స్‌ను తన కళ్లలో మోస్తూ తిరింగిందన్నమాట. వైద్యులు ఇదే విషయాన్ని సదరు మహిళకు చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. తర్వాత తన టీనేజ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది.

ఈ విషయం గురించి మహిళ ‘నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాంటక్ట్‌ లెన్స్‌ వాడుతున్నాను. అప్పుడు నాకు 14 ఏళ్లు ఉంటాయేమో... ఒక రోజు బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా షటిల్‌కాక్‌ నా కళ్లకు తగిలింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే కాంటక్ట్‌ లెన్స్‌ లేదు. షటిల్‌కాక్‌ తగిలినప్పుడే అది ఎక్కడే పడిపోయిందనుకున్నాను. కానీ అది నా కంటి లోపలికి వెళ్లి పోయి ఇన్నాళ్ల పాటు అలానే ఉంది’ అంటూ తెలిపింది. అంతేకాక ఇన్నేళ్లలో తనకు ఎటువంటి కంటి సమస్యలు తలెత్తలేదని తెలిపింది. అయితే ఇన్నాళ్ల నుంచి కంటి లోపల ఉన్న లెన్స్‌ ఇప్పుడిలా బయట పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు డాక్టర్లు. సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోన్న ఈ లెన్స్‌ కథ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

>
మరిన్ని వార్తలు