-

పాక్‌కు షాక్‌.. 'ఇక మీ స్వీట్లు మాకొద్దు'

26 Jan, 2018 16:18 IST|Sakshi
సరిహద్దు వద్ద స్వీట్లు పంచుకుంటున్న భారత్‌, పాక్‌ బలగాలు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ రేంజర్లకు భారత సరిహద్దు బలగాలు (బీఎస్‌ఎఫ్‌) షాకిచ్చాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాక్‌ రేంజర్లు ఆఫర్‌ చేసిన తీపి తినుబండారాలను తీసుకునేందుకు నిరాకరించాయి. సరిహద్దు వెంట ఆక్రమణ చర్యలకు, దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ రూపంలో నిరసన తెలిపాయి. అదేసమయంలో బంగ్లాదేశ్‌ బలగాలతో మాత్రం స్వీట్లు పంచుకున్నాయి. ప్రతి గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికి సరిహద్దు వద్ద ఉన్న గేట్లను ఓసారి ఓపెన్‌ చేసి ఇరు దేశాలకు చెందిన సైనికులు గౌరవ వందనం చేసుకోవడంతోపాటు స్వీట్లు కూడా పంచుకుంటారు.

కొన్ని పండుగల సమయాల్లో ప్రత్యేకంగా స్వీట్లు పంచుకుంటారు. అంతకుముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో మాత్రం మంచి సహకారం దయాగుణం ప్రదర్శిస్తారు. కానీ, ఈ సారి మాత్రం ఆ సంప్రదాయానికి బ్రేక్‌ పడింది. అందుకు పాక్‌ కారణమైంది. 'రెండు దేశాల మధ్య ఎలాంటి సమస్య లేనట్లయితే, ఉద్రిక్త పరిస్థితులు లేనట్లయితే శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. స్వీట్లు తీసుకునే వాళ్లం. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు' అని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఇటీవల పాక్‌ రేంజర్లు నిత్యం సరిహద్దులోని గ్రామాలపై దాడులకు పాల్పడుతుండటమే కాకుండా సైనికులపై కూడా కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు