‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ ట్రంప్‌!

5 Jan, 2018 02:54 IST|Sakshi

సీనియర్‌ జర్నలిస్టు, రచయిత మైకేల్‌ వూల్ఫ్‌ తాజా పుస్తకం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ద ట్రంప్‌ వైట్‌హౌస్‌’లో అనేక వివాదస్పద, సంచలన విషయాలు వెల్లడించింది. ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాని ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను గార్డియన్, వాషింగ్టన్‌ పోస్ట్, న్యూయార్క్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్, ఇతర› ప్రధాన పత్రికలు ప్రచురించాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌›ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు, వైట్‌హౌస్‌ ప్రధాన వ్యూహకర్తగా మొన్నటివరకు పనిచేసిన స్టీవ్‌ బ్యానన్‌ ఈ పుస్తక రచయితకు వెల్లడించిన అంతర్గత విషయాలు ఆసక్తికరంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారం, ట్రంప్‌ను గెలిపించేందుకు రష్యా జోక్యంపై ఆరోపణలు వంటి కీలకాంశాలపై ఈ పుస్తకంలో అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఉండటం దుమారం రేపుతోంది. ఈ పుస్తకంపై ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు.

బ్యానన్‌ పేర్కొన్న ముఖ్యాంశాల్లో కొన్ని..
అది దేశద్రోహం కాదా?:
ట్రంప్‌ టవర్‌లోని 25వ అంతస్తులో విదేశీ ప్రభుత్వ (రష్యా) అధికారులతో జూనియర్‌ ట్రంప్‌ (ట్రంప్‌ కుమారుడు), అల్లుడు జేరెడ్‌ కుష్నర్, ప్రచార మేనేజర్‌ పాల్‌ మనఫోర్ట్‌లు సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈ సమావేశంలో న్యాయవాదులు లేకుండా విదేశీ ప్రతినిధులతో భేటీ కావడం వారికి దేశద్రోహం కాదా?  

సన్నిహితులపై అపనమ్మకం:
రోజూ రాత్రి భోజనం తర్వాత తన సన్నిహితుల్లోని ఒక్కొక్కరి లోపాలు, బలహీనతల గురించి ట్రంప్‌ మాట్లాడతారు. ఒకరికి విధేయత లేదని, మరొకడు బలహీనుడని, కుష్నర్‌ వ్యవహారం సరిగా లేదని, వైట్‌హౌస్‌ అధికారప్రతినిధి సీన్‌ స్పైసర్‌ బుద్ధిహీనుడని ఇలా అందరిపైనా అపనమ్మకంతో ఉండేవారు. తనపై విషప్రయోగం జరుగుతుందని ట్రంప్‌ చాలా భయపడతారు.

ఇవాంకా ‘ప్రెసిడెంట్‌’ కోరిక:
అమెరికాకు అధ్యక్షురాలిని కావాలన్నది ఇవాంకా ట్రంప్‌ ఆశ. అందుకే భర్తతో కలిసి వైట్‌హౌస్‌లో కీలకబాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆమె ట్రంప్‌పైనే జోకులేస్తారు. బట్టతలకు సర్జరీ చేయించుకున్నారని.. అసహనం కారణంగానే ట్రంప్‌ జుట్టురంగు మారిందని చలోక్తులు వేసేవారు. ట్రంప్‌కు గెలుస్తారనే నమ్మకమే లేదని జూనియర్‌ ట్రంప్‌ తన సన్నిహితులతో పేర్కొన్నారు. ఆయన విజయంపై కుటుంబ సభ్యుల్లోనూ అపనమ్మకమే. ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో మెలానియా ఏడ్చేశారు.

ఎవరీ బ్యానన్‌?
స్టీఫెన్‌ కెవిన్‌ బ్యానన్‌ (64).. అమెరికన్‌ మీడియా ఎగ్జిక్యూటివ్, రాజకీయవేత్త, గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా కొనసాగారు. ప్రస్తుతం బ్రీట్‌బార్ట్‌ న్యూస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏడేళ్లపాటు యూఎస్‌ నేవీలో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. ఎర్త్‌సైన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు ‘బయోస్పియర్‌–2’కు యాక్టింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ప్రత్యేకంగా బ్యానన్‌ కోసమే ‘వైట్‌హౌస్‌ ప్రధానవ్యూహకర్త’ హోదాను సృష్టించారు. దాదాపు ఏడునెలల పాటు ఆ పదవిలో పనిచేశాక ఛార్లెట్స్‌విల్లేలో చోటుచేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారిన ఘటన ఆయన ఉద్వాసనకు దారితీసింది. ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధంలోనూ ఆయన పాత్ర ఉంది. ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ ప్రచార కార్యక్రమాలకు సీఈఓ హోదాలో కీలకంగా వ్యవహరించారు. వైట్‌హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక ఇవాంకాను ఉద్దేశించి ‘ఇటుక మాదిరిగా ఆమె కూడా మూగదే’ అని వ్యాఖ్యానించారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు