పాక్‌లో చైనా బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

8 Sep, 2019 17:52 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరతతో విలవిల్లాడుతున్న పాక్‌లో బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు పాక్‌లో చైనా రాయబారి యావో జింగ్‌ ప్రకటించారు. శనివారం స్థానికంగా జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా - పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ పనులు సంతృప్తికరంగా సాగుతున్నట్లు వెల్లడించారు. అంతేకాక అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైతే 90 శాతం పాకిస్తానీ వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు ఎలాంటి సుంకాలు లేకుండా చైనాకు ఎగుమతి అవుతాయన్నారు. దీని వల్ల పాకిస్తాన్‌ ఎగుమతులు 500 మిలియన్‌ డాలర్లకు చేరి తద్వారా ద్వైపాక్షిక వాణిజ్య లోటు తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు వాణిజ్య అవకాశాలను అధ్యయనం చేయడానికి రెండు దేశాల పారిశ్రామికవేత్తలు ఇరు దేశాల్లో పర్యటించే కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు