‘థర్డ్‌ పార్టీ’ ప్రమేయం వద్దు

30 May, 2020 04:46 IST|Sakshi

భారత్‌తో సరిహద్దు వివాదంలో ట్రంప్‌ మధ్యవర్తిత్వంపై చైనా

బీజింగ్‌/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భంగపాటు ఎదురైంది. భారత్‌–చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్‌ ఇచ్చిన ఆఫర్‌ను చైనా తిరస్కరించింది. భారత్‌–చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్‌ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్‌ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్‌ తొలిసారి స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్‌–చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. పరస్పరం చర్చించుకోవడానికి, అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి రెండు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత అధికార యంత్రాంగం, కమ్యూనికేషన్‌ చానళ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోగల సామర్థ్యం రెండు దేశాలకు ఉందన్నారు. భారత్‌–చైనా మధ్య మధ్యవర్తిగా పనిచేస్తానంటూ గురువారం చెప్పిన డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం కూడా ఆదే విషయం పునరుద్ఘాటించారు.  

మిలటరీ ఉద్రిక్తతలపై ట్రంప్‌–మోదీ చర్చించుకోలేదు  
తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్‌–మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్‌ 4న ట్రంప్‌–మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని, ఆ తర్వాత ఇరువురు నేతలు ఎప్పుడూ చర్చించుకోలేదని వెల్లడించాయి. తాను మోదీతో మాట్లాడానని, భారత్‌–చైనా మధ్య ఉద్రిక్తతల విషయంలో ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్‌ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

‘చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనం’  
ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌ పాస్‌ ద్వారా ఈ ఏడాది చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనకూడదని స్థానికులు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం తెలియజేశారు. కరోనా వైరస్‌ పురుడు పోసుకున్న చైనాలో అడుగుపెట్టడం ప్రమాదకరమని గిరిజన వ్యాపారుల సంఘం నాయకుడు, భారత్‌–చైనా వ్యాపార్‌ సంఘటన్‌ ప్రతినిధి విశాల్‌ గార్బియాల్‌ చెప్పారు. భారత్‌–చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ప్రతియేటా జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు జరుగుతుంది.  

మరిన్ని వార్తలు