పుచ్చకాయపై కోపం చూపినందుకు కటకటాలపాలు..!

17 Jul, 2014 09:26 IST|Sakshi
పుచ్చకాయపై కోపం చూపినందుకు కటకటాలపాలు..!

కనెక్టికట్ (అమెరికా): అది అమెరికా కనెక్టికట్‌లోని బాంటమ్ సుపీరియర్ కోర్టు. థామస్టన్‌కు చెందిన కర్మైన్ సెర్విల్లీనో అనే 49 ఏళ్ల వ్యక్తిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతడు ప్రమాదకరమైన పనులకు పాల్పడ్డాడని, అతడి చర్యలు భయపెట్టే రీతిలో ఉన్నాయనే అభియోగాలపై అరెస్టు చేసినట్టు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 500 డాలర్ల బెయిల్ బాండ్ సమర్పించిన తర్వాత కర్మైన్‌ను విడుదల చేశారు. ఇంతకీ అతడు చేసిన ఆ ప్రమాదకరమైన పని ఏమిటో తెలుసా? పుచ్చకాయను కసితీరా కోయడమే.! విషయం ఏమిటంటే.. సెర్విల్లీనోకు, అతడి భార్యకు మనస్పర్థలొచ్చి విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త టూల్ బాక్సులో గంజాయితోపాటు కొన్ని డ్రగ్స్ గుర్తించానని పేర్కొంటూ అతడి భార్య ఈనెల 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఇంటికి వచ్చేసరికి వంటగదిలో ఓ పెద్ద కత్తి గుచ్చి ఉన్న పుచ్చకాయ కనిపించింది. అదే సమయంలో ఆమె భర్త అక్కడకు వచ్చి ఏమీ మాట్లాడకుండానే ఆ కత్తితో పుచ్చకాయను కసితీరా కోసిపారేశాడు. తనను బెదిరించే ఉద్దేశంతోనే అతడు అలా చేశాడని ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెర్విల్లీనోను శనివారం పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఉదంతాన్ని తాము గృహహింస కిందే పరిగణనలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు