ప్రాణాల‌కు తెగించి కాపాడిన కుక్క‌

5 May, 2020 10:23 IST|Sakshi

కాన్‌బెర్రా: బేర్‌.. మామూలు శున‌కం కాదు.. వంద జంతువుల‌ను కాపాడిన వీర శున‌కం. "ప‌ది మందిని కాపాడ‌టం కోసం మ‌న ప్రాణం పోయినా స‌రే" అన్న వాక్యాన్ని అక్ష‌రాలా పాటిస్తోంది. గ‌త ఏడాది ఆస్ట్రేలియాలో అడ‌వుల్లో కార్చిచ్చు మొద‌లైన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు మంట‌ల్లో చిక్కుకున్న వంద‌కు పైగా కోలాల‌ను ఈ కుక్క‌ ప్రాణాల‌కు తెగించి కాపాడింది. అయితే మొద‌ట్లో దీనికున్న ఒబెసివ్ కంప‌ల్సివ్ వ్యాధి కార‌ణంగా క‌నీసం ఆడుకోడానికి కూడా పంపించేవారు కాదు. కానీ త‌ర్వాత దీన్ని ఓ యూనివ‌ర్సిటీ వారు అక్కున చేర్చుకుని దానికి ప్ర‌మాదాల స‌మ‌యంలో ఇత‌రుల‌ను ఎలా కాపాడాలో త‌ర్ఫీదు ఇచ్చారు. అలా కార్చిచ్చు అంటుకున్న స‌మ‌యంలో దీని సేవ‌ల‌ను వినియోగించుకున్నారు డ్రోన్ల ద్వారా చెట్టు, పుట్ట‌ల్లో దాక్కున్న‌ కోలాల‌ను గుర్తించి వాటిని ర‌క్షించేందుకు బేర్‌ను పంపించేవారు. (ఆస్ట్రేలియాను రక్షించేదెవరు?)

అలా చుట్టుముట్టుతున్న మంట‌ల‌ను ఏమాత్రం లెక్క చేయ‌కుండా ప‌రుగెత్తుకుంటూ వెళ్లి గాయ‌ప‌డిన కోలాల‌ను కాపాడింది. ప్ర‌స్తుతం దీని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్ర‌తి ఒక్క‌రూ దాని సాహ‌సానికి నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఇదిలా వుండ‌గా గ‌తేడాది జూన్‌లో ప్రారంభ‌మైన కార్చిచ్చు ఈయేడు మార్చికి చ‌ల్లారింది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌ద్దెనిమిది మిలియ‌న్ల హెక్టార్ల అగ్గి బుగ్గగ్గ‌వ‌గా 5,900 ఇళ్లు అగ్నికి ఆహుత‌య్యాయి. కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు. మంటల్లో చిక్కుకున్న‌ ల‌క్ష‌లాది జంతువులు బూడిద‌గా మారాయి. అయితే ఇప్ప‌టికీ అడ‌విలో ఇంకా ఎన్నో జంతువులు ఆక‌లితో చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని ర‌క్ష‌ణ బృందంలోని ఓ స‌హాయ‌కుడు పేర్కొన్నాడు. వాటిని క‌నుగొని స‌రైన ఆహారాన్ని అందించి ఆ త‌రువాత‌ తిరిగి అడ‌వి ఒడిలోకి పంపిస్తామ‌ని తెలిపాడు. (చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు)

మరిన్ని వార్తలు