ఒబామా నా ఫోన్లు ట్యాప్‌ చేశారు: ట్రంప్‌

5 Mar, 2017 01:35 IST|Sakshi
ఒబామా నా ఫోన్లు ట్యాప్‌ చేశారు: ట్రంప్‌

వాషింగ్టన్ : ట్రంప్‌ టవర్లలోని తన ఫోన్లను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ట్యాప్‌ చేశారని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం ఆరోపించారు. ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడక ముందే ఈ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆయన ట్వీట్లలో చెప్పారు. ట్యాపింగ్‌ను ట్రంప్‌ ‘వాటర్‌గేట్‌’ కుంభకోణంతో పోల్చారు. అయితే ట్యాపింగ్‌ ఆధారాలను ట్రంప్‌ బయటపెట్టలేదు.

‘ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వ్యక్తి ఫోన్లను సిట్టింగ్‌ అధ్యక్షుడు ట్యాప్‌ చేయడం న్యాయ సమ్మతమేనా? మరింత దిగజారిపోయారు’అని ఒబామాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘ఎన్నికలవేళ ఫోన్లను ట్యాప్‌ చేయడానికి ఒబామా ఎంత దిగజారిపోయారు! ఒబామా చెడ్డవారు’ అని మరో ట్వీట్‌చేశారు. ఈ ఆరో పణలను ఒబామా తోసిపుచ్చారు. ‘అక్టోబర్‌లో ఒబామా నా ఫోన్లను ట్యాప్‌ చేసిన అంశంపై ఒక మంచి లాయర్‌ బలమైన కేసు వేయగలరు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యా రాయబారిని కలిసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అటార్నీ జనరల్‌ సెసన్స్ ను ట్రంప్‌ వెనకేసుకొచ్చారు. ఒబామా కాలంలోనే సెసన్స్ , రష్యా రాయబారు లు అధికారికంగా సమావేశమయ్యారని ట్రంప్‌ గుర్తుచేశారు. సెసన్స్ ను కలిసిన రష్యా రాయబారే ఒబామా పదవిలో ఉన్నప్పుడు శ్వేతసౌధానికి 22 సార్లు వచ్చి వెళ్లారనీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్‌ లాయర్లకు గడువు
సియాటెల్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణ నిషేధ ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు చట్టబద్ధ పౌ రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సియాటెల్‌ ఫెడరల్‌ జడ్జి ట్రంప్‌ లాయర్లకు రెండు వారాల గడువు ఇచ్చారు.

యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న తమ పిల్లలను కలుసు కోవడానికి ఆ ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని వారు ఆరోపించారు. ఫిర్యాదుదారులు ఈ కేసును ‘క్లాస్‌ ఆక్షన్ ’ న్యాయవ్యాజ్యంగా మార్చుకోవడానికి చేస్తున్న యత్నాలపై స్పందించడానికి ట్రంప్‌ లాయర్లకు తగిన సమయం ఇస్తున్నట్లు జడ్జి జేమ్స్‌ రాబర్ట్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు