గ్రీన్‌ కార్డ్స్‌పై భారతీయులకు శుభవార్త

31 Jan, 2018 09:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన భారతీయులకు శుభవార్త కానుంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పించాలని ట్రంప్‌ ప్రకటన చేశారు. అలా చేయడం ద్వారా మాత్రమే అమెరికాను ప్రథమ స్థానంలో ఉంచగలమని స్పష్టం చేశారు. అలాగే, లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలకబోతున్నానని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, నిరంతర వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్‌ తాజాగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి గతంలో కాన్సాస్‌లో జాతి విధ్వేష కాల్పుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ విబేధాలను పక్కన పెడుతూ అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. ఇటీవల సంభవించిన విపత్తు మన భూభాగాన్ని తుడిచిపెట్టిందని అన్నారు.

'అమెరికాలో శాశ్వత పౌరసభ్యత్వం ఇచ్చేందుకు అందించే గ్రీన్‌ కార్డులను ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలి. ఎందుకంటే అమెరికాను ముందు వరసలో ఉంచడానికి అదొక్కటే మార్గం. మెరిట్‌ ఆధారిత వలస విధానం ప్రారంభించడానికి ఇదే సమయం. ఎవరైతే అధిక నైపుణ్యాలు కలిగి ఉన్నారో, ఎవరు మన సమాజానికి మంచి సేవలను అందించగలరో, ఎవరు మన దేశాన్ని ప్రేమించి గౌరవిస్తారో వారికి మాత్రమే మనం గ్రీన్‌ కార్డులు ఇవ్వాలి' అని ట్రంప్‌ చెప్పారు. మెరిట్‌ ఆధారిత వలస వ్యవస్థను ట్రంప్‌ తీసుకొస్తే అది ఎక్కువమంది భారతీయులకు మేలును అందిస్తుంది. అయితే, వారి కుటుంబాలను విస్తరించుకునేందుకు మాత్రం అడ్డుకునే అవకాశం ట్రంప్‌ ప్రకటించిన విధానంలో ఉండనుంది. ఎందుకంటే చైన్‌ మైగ్రేషన్‌ విధానం ఉండబోదని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ ప్రసంగాన్ని డెమొక్రాట్స్‌ బహిష్కరించారు.

>
మరిన్ని వార్తలు