అందుకు ట్రంప్‌ డబ్బు చెల్లించారు’

8 Jul, 2020 11:23 IST|Sakshi

మేరీ ట్రంప్‌ 

వాషింగ్టన్‌: తన బదులుగా వేరొక వ్యక్తి చేత పరీక్ష రాయించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రఖ్యాత విద్యాసంస్థలో ప్రవేశం పొందారని ఆయ‌న‌ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ ఆరోపించారు. ప్రతిష్టాత్మక ఎస్‌ఏటీ(సాట్‌) పరీక్ష ద్వారా వేరొక ప్రతిభావంతుడికి దక్కాల్సిన సీటును ఆయన కొనుక్కున్నారని పేర్కొన్నారు. ‘టూ మ‌చ్ అండ్ నెవ‌ర్ ఎన‌ఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వ‌రల్డ్ మోస్ట్ డేంజ‌ర‌స్ మ్యాన్’ పేరిట రచించిన పుస్తకంలో మేరీ.. డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి లోకానికి తెలియని అనేక విషయాలను పొందుపరిచారు.

త‌న తండ్రి జూనియ‌ర్ ఫ్రెడ్‌, డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య ఉన్న సంబంధ‌ బాంధ‌వ్యాలను పుస్త‌కంలో ప్రస్తావించిన ఆమె.. ట్రంప్‌ వ్యక్తిత్వాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించారు. వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్న ఈ పుస్తకంలో ‘‘పెన్సిల్వేనియాలోని ప్రతిష్టాత్మక వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ పొందేందుకు వేరే వ్యక్తి చేత పరీక్ష రాయించారు. అందుకు డబ్బు చెల్లించారు’’ అని పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనం ప్రచురించింది. (ట్రంప్ ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి: మేరీ ట్రంప్)

కాగా క్లినికల్‌ సైకాలజీలో డిగ్రీ చేసిన మేరీ ట్రంప్‌.. పారనాయిడ్‌ స్కిజోఫ్రేనియా (భ్రాంతిలో బ‌తికేయ‌డం)తో బాధ‌ప‌డుతున్న రోగుల‌ను ఆరు నెల‌ల‌పాటు లోతైన‌ అధ్య‌య‌నం చేశారు. ఇక మీడియా తాజా కథనంపై స్పందించిన శ్వేతసౌధం సీనియర్‌ సలహాదారు కెల్యానే కాన్వే.. ‘‘ట్రంప్‌ ఆమె పేషెంట్‌ కాదు. ఆయన తన అంకుల్‌. అయినా కుటుంబ విషయాలను కుటుంబ విషయాలు గానే చూడాలి’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ‘‘ఈ పుస్తకంలో ఉన్నవన్నీ అబద్ధాలే’’ అంటూ శ్వేతసౌధ ప్రెస్‌ సెక్రటరీ కేలే మెకానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్‌నకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టే మేరీ పుస్తకాన్ని అడ్డుకునేందుకు ఆయన కుటుంబం ప్రయ‌త్నిస్తోంద‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది థియోడ‌ర్ బౌట్ర‌స్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు