అమెజాన్‌, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ 

5 Mar, 2020 14:39 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కూడా కరోనా వైరస్‌ సెగ తాకింది. సియాటెల్‌కు చెందిన  ఫేస్‌బుక్ కాంట్రాక్టర్‌కు కోవిడ్‌-19 (కరోనా వైరస్) సోకింది. దీంతో తక్షణమే అలర్ట్‌ అయిన ఫేస్‌బుక్‌ సియాటెల్‌లోని తూర్పు, పశ్చిమ కార్యాలయాలను మార్చి 9 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలియజేశామని, ప్రతీ ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ, ప్రాజారోగ్య అధికారుల సలహాలను పాటిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కాంట్రాక్టర్‌కు వైరస్‌ సోకిన వైనాన్ని ధృవీకరించిన సంస్థ సదరు వ్యక్తి చివరిసారిగా ఫిబ్రవరి 21 న స్టేడియం ఈస్ట్ కార్యాలయంలో ఉన్నారని తెలిపింది.  అలాగే మార్చి 31 వరకు ఇంటి నుండే పని చేసేందుకు ప్రయత్నించమని ఉద్యోగులందరినీ కోరినట్టు వెల్లడించింది.  ఫేస్‌బుక్‌లో దాదాపు 20 కార్యాలయాల్లో 5,000 మందికి పైగా ఉద్యోగులు సియాటెల్‌ వాసులే. ఇప్పటికే ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌  కూడా అమెరికాలో పనిచేస్తున్న  తమ ద్యోగి కరోనా బారిన పడినట్టు అమెజాన్‌ ధృవీకరించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన అమెజాన్‌ ఉద్యోగి ఫిబ్రవరి 24 న సియాటెల్‌లోని ఫేస్‌బుక్  అర్బర్ బ్లాక్స్ కార్యాలయంలో డిన్నర్‌ చేసినట్టు తెలుస్తోంది. కాగా అమెరికాలో కరోనావైరస్‌ బారిన పడిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా సియాటెల్‌లో  ఈ రోజు 10 కొత్త కేసులు నమోదైనట్టుకింగ్ కౌంటీ ప్రజారోగ్య అధికారులు తెలిపారు. దీంతో 31 మంది ఈ  వైరస్‌ సోకగా, తొమ్మిది మంది మరణించారు.

మరిన్ని వార్తలు